?max-results="+numposts1+"&orderby=published&alt=json-in-script&callback=showrecentposts1\"><\/script>");

Popular Posts

What’s Hot

భారతదేశ చరిత్ర

భారతదేశ చరిత్ర క్రీ .పూ. 34 వేల ఏళ్ల కిందట హోమోసెఫియన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్రకారుల అభిప్రాయం. భారతదేశ చరిత్ర అంటే భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్‌తో కూడిన సమస్త భారత ఉపఖండ చరిత్ర. వేదాల్లో భారత దేశాన్ని జంబూ ద్వీపంగా పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో నేరేడు పళ్లు ఎక్కువగా లభించడం వల్ల ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. భరతుడు అనే రాజు పేరు మీదుగా భారతదేశం లేదా భరతవర్షం అనే పేర్లు స్థిరపడ్డాయి. సింధూ నదికి ఆవల ఉన్న నాటి పర్షియన్లు, గ్రీకులు ఈ ప్రాంతాన్ని హిందూ దేశమని పిలిచారు. బ్రిటిషర్ల మూలంగా ఇండియా అనే పేరు వచ్చింది. సింధూ నదిని ఇండస్ అని పిలిచేవారు.
ఒక దేశ ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనం వారి భౌగోళిక పరిస్థితులతో ప్రత్యక్షంగా ప్రభావితమవుతుంది. అధికంగా సారవంతమవడం వల్ల భారతదేశ దక్షిణ ప్రాంతం కంటే గంగా, సింధూ మైదాన ప్రాంతం అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. గంగా - సింధూ మైదానాలు, కృష్ణా, గోదావరి, తుంగభద్ర, కావేరి నదీ ప్రాంతాలు సాంస్కృతికంగా ముందు వరుసలో నిలిచాయి. జైన, బౌద్ధ, హిందూ మతాలు, లలిత కళలు ఈ ప్రాంతాల్లో విశేషంగా విలసిల్లాయి. అందువల్లే ఈ ప్రాంతాలపై ఆధిపత్యం కోసం నిరంతరం యుద్ధాలు జరిగాయి. భారతదేశ పశ్చిమ - మధ్య ప్రాంతాలకు (రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) భౌగోళికంగా సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇవి ఇతర నాగరిక ప్రాంతాల నుంచి వేరవడం వల్ల ఇక్కడి ప్రజలు సాంఘిక దురాచారాలకు లోనయ్యారు. 

నాగరికత పరిణామ క్రమంలో లిపి వాడుకలోకి రాని పూర్వయుగాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా పేర్కొంటారు. లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ‘ప్రొటో హిస్టరీ యుగం’గా, లిపి సృష్టి జరిగి రాత ఆరంభమైనప్పటి నుంచి ‘చారిత్రక యుగం’గా వ్యవహరిస్తారు. మన దేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన సింధూ నాగరికత ప్రొటో హిస్టరీకి సంబంధించింది. ఎందుకంటే అప్పటి ప్రజలు వాడిన లిపిని మనం అర్థం చేసుకోలేకపోయాం. చరిత్రలో కాలాన్ని క్రీస్తు పూర్వయుగంగా, క్రీస్తు శకంగా విభజించారు. 
పాతరాతి యుగం (క్రీ.పూ. 35000-10000)
  • ఈ యుగంలో మానవులు ఎక్కువగా అడవుల్లో నివసించేవారు.
  • క్వార్టజైట్ అనే కఠిన శిలతో కత్తి, సుత్తి, గొడ్డలి, బల్లెం, బొరిగ మొదలైన ఆయుధాలను తయారుచేసుకున్నారు.
  • జంతువులను వేటాడి పచ్చిమాంసం తినేవారు.
  • చెట్ల తొర్రలు, కొండ గుహల్లో నివసించేవారు.
  • ఆకులు, చర్మాన్ని దుస్తులుగా కప్పుకునేవారు.
  • వీరికి పంటలు పండించడం తెలియదు.
  • వీరు నివసించిన గుహలు కర్నూలులో ఉన్నాయి.
  • అండమాన్ దీవుల్లోని ఆదిమవాసులు, ఆంధ్రాలోని యానాదులు, తమిళనాడులోని కురుంబులు, ఇరుళులు, కదిరులు ఈ యుగ సంతతికి చెందినవారని చరిత్రకారుల అభిప్రాయం.
మధ్యరాతి యుగం (క్రీ.పూ. 8000-4000)
  • మధ్యరాతి యుగంలో ప్రజలు సంచార జీవితానికి స్వస్తి పలికారు. స్థిర నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభమైంది.
  • జంతువులను మచ్చిక చేసుకున్నారు.
  • ఈ కాలానికి చెందిన ప్రజలు జెస్పర్, చెర్ట్ అనే ఇసుక రాళ్లతో చేసిన పరికరాలు, ఆయుధాలను ఉపయోగించేవారు. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండేవి. అందువల్ల ఈ యుగాన్ని ‘సూక్ష్మ శిలాయుగం’గా పేర్కొంటారు.
  • మరణించిన వారిని ఆహారం, వారు వాడిన పనిముట్లతో పాటు ఖననం చేసేవారు.
నూతన శిలా యుగం (క్రీ.పూ. 4000-2500)
  • నూతన శిలా యుగంలో మానవ జీవన సరళిలో స్థిరత్వం చోటుచేసుకుంది.
  • పంటలు పండించడాన్ని విస్తృతపరిచారు.
  • నూలు, ఉన్ని వస్త్రాలను నేయడం నేర్చుకున్నారు.
  • ‘వ్యవసాయం, పశుపోషణ’ ముఖ్య వృత్తులుగా మారాయి.
  • ఇళ్ల నిర్మాణం జరిగి పల్లెలు ఏర్పడ్డాయి.
  • సరకుల రవాణా కోసం బండ్లను వినియోగించారు.
  • మట్టి పాత్రలను ఎక్కువగా తయారు చేశారు.
  • పదునైన, నునుపైన, అందమైన రాతి పనిముట్లు, ఆయుధాలను రకరకాల ఆకృతుల్లో తయారుచేసి ఉపయోగించేవారు.
  • విగ్రహారాధన, లింగపూజ, చంద్రుని వృద్ధి, క్షయ దశల ఆధారంగా రోజులను లెక్కవేయడం వీరి నుంచే ప్రారంభమైంది.
  • వీరు జంతువులు, శిలలు, పితృదేవతలు, భూతాలను ఆరాధించారు.
  • మరణించినవారిని సమాధి చేసేవారు.
  • ఎముకలు, గవ్వలతో రూపొందించిన ఆభరణాలు ధరించేవారు.
  • ఈ యుగానికి చెందిన ప్రజలు ఆస్ట్రిక్ జాతివారని కొందరు చరిత్రకారుల భావన.
సింధూ నాగరికత (క్రీ.పూ. 2500-1750)
రాగి లోహం వాడుకతో ఈ యుగం ప్రారంభమైనందువల్ల దీన్ని ‘తామ్ర శిలాయుగం’గా పేర్కొంటారు. దీన్ని ‘హరప్పా సంస్కృతి’ అని కూడా అంటారు. 1921లో సింధూ మైదాన ప్రాంతంలో చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో హరప్పా ప్రదేశం బయల్పడింది. అందువల్ల దీన్ని ‘సింధూ నాగరికత’ లేదా ‘హరప్పా నాగరికత’గా వ్యవహరించారు.
హరప్పా, మొహంజోదారో ప్రదేశాలు ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నాయి. హరప్పా నగరంలో ధాన్యాగార భవనం ఒక విశిష్ట నిర్మాణం. మొహంజోదారోలో బయల్పడిన స్నానవాటిక ప్రసిద్ధి చెందింది. చాన్హుదారో కోటలకు ఖ్యాతి చెందింది. గుజరాత్‌లోని లోథాల్ ప్రసిద్ధ రేవు పట్టణం. దేశ, విదేశీ (మెసపటోమియా ప్రజలతో) వాణిజ్యం చేశారు. రాజస్థాన్‌లోని కాళీభంగన్, హరియాణాలోని బన్వాలి కూడా ఈ నాగరికతకు చెందిన ముఖ్యమైన ప్రదేశాలు. సింధూ స్థావరాల్లో రాఖీగర్హిని అతి పెద్ద నగరంగా 2014లో పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతకుముందు వరకు మొహంజోదారోను పెద్ద నగరంగా పరిగణించేవారు.
నాటి మెసపటోమియా, ఈజిప్టు నాగరికత కంటే సింధూ నాగరికత పరిధి చాలా విస్తృతమైంది. ఈ నాగరికతకు చెందిన ప్రజలు గ్రిడ్ పద్ధతిలో పట్టణాలను నిర్మించారు. మెలుహా ప్రాంతంవారికి సుమేరియన్లతో ఉన్న సంబంధాల గురించి కొన్ని సుమేరియన్ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. సింధూ ప్రాంతాన్ని అత్యంత ప్రాచీన కాలంలో ‘మెలుహా’గా వ్యవహరించేవారు. 
హరప్పా నాగరితను పట్టణ నాగరికతగా పేర్కొనవచ్చు. వీధులు ఉత్తర, దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు, పడమరలుగా చక్కని దీర్ఘచతురస్ర ఆకారంలో నిర్మించారు. నిర్మాణాలకు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. భూగర్భ మురుగు పారుదల సౌకర్యం నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. నగర ప్రజల సమష్టి ప్రయోజనాల కోసం సభా మందిరాన్ని కూడా నిర్మించారు. గోధుమ, బార్లీ వీరి ప్రధానమైన పంటలు. 
లోథాల్ నగరంలో పత్తి, వరి పండించినట్లుగా ఆధారాలు లభించాయి. వీరు పాలు, కూరగాయలు, గోధుమ, బార్లీతో పాటు మంసాహారాన్ని కూడా తీసుకునేవారు. ఎద్దు, మహిషం, గొర్రె, పంది, ఒంటె, కుక్క, ఆవు లాంటి పెంపుడు జంతువులు, ఖడ్గమృగం, పెద్దపులి, ఎలుగుబంటి, వానరం తదితర వన్యమృగాలు వీరికి తెలుసు. వీరు యుద్ధాల్లో రాగితో చేసిన గొడ్డలి, కత్తి, బల్లెం, విల్లంబులు, బాడిశ తదితర పరికరాలను ఉపయోగించారు. కానీ రక్షణ కవచాలు తెలియదు. గృహ సామగ్రి కోసం రాగి, వెండి, పింగాణీతో పాటు శిలలు, దంతాలతో చేసిన వస్తువులను వినియోగించారు. వీరు దశాంశ పద్ధతిలో తూనికలు ఉపయోగించారు. సింధూ ప్రజల మట్టి ముద్రికలు, శిలా విగ్రహాలు, లోహ ప్రతిమల ఆధారంగా వీరు ప్రధానంగా మాతృదేవత లేదా అమ్మతల్లిని ఆరాధించినట్లుగా తెలుస్తోంది. మూడు ముఖాలతో పద్మాసీనుడై ఉన్న శివుని చుట్టూ వన్యమృగాలున్న ఒక ముద్రిక లభించింది. దీని ఆధారంగా వీరు పశుపతిగా, మహాయోగిగా శివుణ్ని ఆరాధించేవారని, వృక్షాలు, సర్పాలను కూడా పూజించేవారని తెలుస్తోంది. ‘స్వస్తిక్’ అనేది సూర్య దేవతారాదనకు చిహ్నం. మృతదేహాన్ని పూడ్చి పెట్టేవారు. సింధూ ప్రజల లిపి బొమ్మల లిపి. దీన్ని కుడి నుంచి ఎడమ దిశకు రాసినట్లుగా తెలుస్తోంది.
మొహంజోదారో నగరం ఏడుసార్లు ధ్వంసమైనా మళ్లీ నిర్మించారు. ఇక్కడ 4.5 అడుగుల నాట్యం చేస్తున్న స్త్రీ విగ్రహాన్ని కనుగొన్నారు. వీరికి గుర్రం తెలియదు. అందువల్ల గుర్రాన్ని ఉపయోగించిన ఆర్యులు వీరిని సులభంగా ఓడించారని చరిత్రకారుల అభిప్రాయం. కొంత వరకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఈ నాగరికత నాశనం చెందడానికి కారణమై ఉంటాయని భావిస్తున్నారు. 
సింధూ నాగరికత ప్రజలకు సమకాలీకులైన సుమేరియన్లు ఇనుమును ఉపయోగించినా వీరు దీన్ని వాడలేదు. ఎన్నిసార్లు వరదలు వచ్చినా అదే ప్రాంతంలో నివసించారు. ఈ కారణాల వల్ల వీరికి ఆధునిక పద్ధతులను త్వరగా స్వీకరించే మనస్తత్వం లేదని భావిస్తున్నారు. 
సింధూ నాగరికత ప్రజల ప్రత్యేకతలు
  • వరి, పత్తి పండించడంలో సిద్ధహస్తులు.
  • తూనికలు, కొలతలను ప్రామాణికబద్ధం చేశారు.
  • స్త్రీ శక్తిని పూజించడం వీరి నుంచే ప్రారంభమైంది. లింగ పూజ, అగ్ని పూజ, కోనేటి స్నానం వీరే ప్రారంభించారు.
  • దువ్వెనలు వాడటం, గాజులు ధరించడం వీరి నుంచి వచ్చినవే.
సింధూ నాగరికతకు చెందిన నగరాలు
నగరం
కనుగొన్న సం.
కనుగొన్నవారు
హరప్పా
1921
దయారాం సహాని
మొహంజోదారో
1922
ఆర్.డి. బెనర్జీ
చాన్హుదారో
1935
ఎం.జి. మజుందార్
కాళీభంగన్
1953
ఎ.కె. ఘోష్
రూపర్
1953
వై.డి. శర్మ
లోథాల్
1954
ఎస్.ఆర్. రావ్
రాఖీగర్హి
1963
-
బన్వాలీ
1973
ఆర్.ఎన్. బిస్త్
దోలవీర
1991
ఘోష్

జైనమతం (క్రీ.పూ. 540-468) 
జైనమత స్థాపకుడు రుషభనాథుడు. జైన ప్రవక్తలను ‘తీర్థంకరులు’ అంటారు. మొత్తం 24 మంది తీర్థంకరులు ఉండేవారు. రుషభనాథుడు మొదటి తీర్థంకరుడు. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. చివరివారైన 24వ తీర్థంకరుడు మహావీరుడు. 

మహావీరుడు క్రీ.పూ. 540లో వైశాలి నగరానికి సమీపాన ఉన్న ‘కుంద’ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు సిద్ధార్థుడు, వైశాలి. మహావీరుడి భార్య యశోధ, కుమార్తె ప్రియదర్శిని. ఈయన జీవిత సుఖాలతో తృప్తి చెందక కొంత కాలం దిగంబరుడిగా కఠోర నియమాలను పాటించి తపస్సు చేశాడు. ‘జృంబిక’ గ్రామంలో పరిపూర్ణజ్ఞానాన్ని పొందిన తర్వాత ‘మహావీరుడు’గా పేరు పొందాడు. ఈయన ప్రబోధించిన సరైన క్రియ, సరైన విశ్వాసం, సరైన జ్ఞానం అనే మూడు అంశాలను ‘త్రిరత్నాలు’గా పేర్కొంటారు. పంచవ్రతాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని మహావీరుడు ప్రవచించాడు. ఈయన తన 72వ ఏట క్రీ.పూ. 468లో ‘పావాపురి’ వద్ద నిర్యాణం చెందాడు. 

జైనులు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఉపవాసాలు చేసి శరీరాన్ని కృశింపజేసుకొని మరణించడాన్ని ‘సల్లేఖన వ్రతం’గా పేర్కొంటారు. చాలా మంది రాజులు జైనమతాన్ని ఆదరించి అభివృద్ధి చేశారు. చంద్రగుప్త మౌర్యుడు ఈ మతాన్ని అనుసరించి, అన్నింటినీ త్యజించి శ్రావణ బెళగొళలో మరణించాడు. జైనులు ప్రజల భాష అయిన ప్రాకృతంలో తమ సందేశాన్ని ప్రచారం చేశారు. చంద్రగుప్తుడి కాలంలో పాటలీపుత్రంలో స్థూలభద్ర ఆధ్వర్యంలో జైనమత మొదటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జైనమత బోధనలను 12 అంగాలుగా విభజించి క్రోడీకరించారు. కొంతకాలం తర్వాత వస్త్రధారణ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తడం వల్ల జైనమతం దిగంబర, శ్వేతాంబర శాఖలుగా చీలిపోయింది. రెండో జైన సంగీతి క్రీ.శ. 512లో వల్లభి (గుజరాత్)లో దేవార్థి క్షమపణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ‘గంధర్వ’ అనే పవిత్ర గ్రంథాలను క్రమానుసారంగా రాశారు. జైనులు శిల్పకళను అభివృద్ధి చేశారు.

క్రీ.పూ. 4వ శతాబ్దం చివరి రోజుల్లో గంగా లోయ ప్రాంతంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చాలామంది జైన గురువులు, సన్యాసులు దక్షిణ భారతదేశానికి తరలివెళ్లారు. ముఖ్యంగా శ్రావణ బెళగొళ ప్రాంతానికి ఎక్కువ మంది వచ్చారు. దక్షిణానికి వచ్చినవారిలో భద్రబాహుడు, చంద్రగుప్త మౌర్యుడు లాంటి ప్రముఖులు ఉన్నారు. మగధలో ఉన్న జైనులు శ్వేతాంబరులయ్యారు. వీరికి గురువు స్థూల బాహుడు. 

జైనమత మహత్వ సూత్రాలు:
1) అహింస
2) సత్యభాషణ
3) అపరిగ్రహం (దొంగిలించకపోవడం)
4) అస్తేయం (ఆస్తి లేకుండా ఉండటం)
5) బ్రహ్మచర్యం
వీటిలో మొదటి నాలుగు సూత్రాలు మహావీరుడి ముందు కాలం నుంచే అమల్లో ఉన్నాయి. మహావీరుడు బ్రహ్మచర్యాన్ని పంచమ సూత్రంగా కలిపాడు.

జైనుల ప్రధాన కట్టడాలు:
  • అబూ పర్వతం - మహావీరుడి దేవాలయం
  • శ్రావణ బెళగొళ - గోమఠేశ్వరుడి విగ్రహం
  • అజంతా, ఎల్లోరా, ఉదయగిరి గుహలు
  • బాదామి - జైన దేవాలయాలు
అజీవికులు: గోశాల మస్కారిపుత్రుడు అజీవిక మతశాఖను స్థాపించారు. ఇది జైన మత సిద్ధాంతాలకు సన్నిహితంగా ఉంది. అశోకుడి కాలంలో ఇది బాగా వ్యాప్తి చెందింది.

హర్యాంక వంశం (క్రీ.పూ.542-490)క్రీ.పూ. 542-490 మధ్య కాలంలో రాజకీయంగా అనేక పరిణామాలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలో మహాజనపదాలుగా పేర్కొనే పదహారు పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటినే ‘షోడశ మహాజనపదాలు’ అంటారు. వీటిలో మగధ రాజ్యం శక్తిమంతమైంది. గిరివజ్రం, పాటలీపుత్రం దీని రాజధాని నగరాలు. మొదటగా దీన్ని బృహద్రధ వంశస్థులు పాలించారు. తర్వాత హర్యాంక వంశస్థులు పరిపాలించారు. వీరిలో బింబిసారుడు గొప్పవాడు. ఈయన తర్వాత అజాతశత్రువు పాలించాడు. 
అజాతశత్రువు పాలనా కాలం క్రీ.పూ. 495-464. ఈయన హర్యాంక వంశ స్థాపకులైన బింబిసారుడి కుమారుడు. అజాతశత్రువు భార్య వజీరాదేవి. ఈమె కోసలరాజు ప్రసేనజిత్తు కుమార్తె. అజాతశత్రువు వజ్జి గణరాజ్య సమాఖ్యతో 16 ఏళ్లు యుద్ధం చేసి జయించాడు. కంటక శిల, కంటక బోధన అనే రాళ్లు, విసరు రథాలను యుద్ధంలో ఉపయోగించి శత్రురాజులను జయించాడు. ఈయన పాటలీపుత్రాన్ని నిర్మించాడు. ఈయనకు కుణిక అనే పేరు కూడా ఉంది. ఉదయనుడు ఈయన వారసుడు. 
అజాతశత్రువు గౌతమబుద్ధుడి సమకాలీకుడు.
హర్యాంక వంశం తర్వాత మగధను శిశునాగవంశం (క్రీ.పూ. 490-458) పాలించింది. వీరి తర్వాత నంద వంశస్థులు రాజ్యానికి వచ్చారు. నంద వంశంలో మహాపద్మనందుడు గొప్పరాజుగా పేరు పొందాడు. ఈయనకు ‘మహాక్షత్రాంతక’ అనే బిరుదు ఉంది. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో నందవంశాన్ని నిర్మూలించి మౌర్యవంశాన్ని స్థాపించాడు.

విదేశీ దండయాత్రలు (క్రీ.పూ. 327-325)భారతదేశంలో రాజకీయ అనైక్యత కారణంగా విదేశీయులు దండయాత్రలు ప్రారంభించారు. పారశీకులు మొదటగా భారత్‌పై దండయాత్ర చేశారు. వీరిలో ‘సైరస్’, ‘డేరియస్’ గొప్పవారు. పారశీక చక్రవర్తి ‘సైరస్’ గాంధారను జయించారు. వీరి తర్వాత గ్రీకులు భారతదేశంపై దండెత్తారు. గ్రీకు రాజ్యాల్లో అగ్రగామి అయిన మాసిడోనియా చక్రవర్తి అలెగ్జాండర్ విశ్వవిజేతగా పేరు పొందారు. గ్రీకు దండయాత్రల ఫలితంగా భారతదేశానికి, యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. భారతీయులు గ్రీకుల నుంచి నాణేల ముద్రణ; శిల్ప, ఖగోళ శాస్త్రాలను నేర్చుకున్నారు.

మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ. 322)మౌర్యుల చరిత్రకు ఆధారాలు:విదేశీ గ్రంథాలు: మెగస్తనీస్ (గ్రీకు రాయబారి) రాసిన ‘ఇండికా’, స్ట్రాబో, డియోడరస్, ఏరియస్, ప్లీనీ రచనలు మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.
సాహిత్య ఆధారాలు: కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’, విశాఖదత్తుడి ‘ముద్రారాక్షసం’.
మత సంబంధ ఆధారాలు: పురాణాలు, బౌద్ధుల దివ్య వదన, అశోకవదన, శ్రీలంకకు సంబంధించిన దీపవంశ, మహావంశ, జైనులకు సంబంధించిన పరిశిష్ట పర్వణ్ మొదలైనవి కూడా మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి దోహదపడుతున్నాయి. 
వీటితో పాటు శిలా శాసనాలు, రాతి చెక్కడాలు, గుహలు కూడా మౌర్యుల చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి. 
చంద్రగుప్త మౌర్యుడు: ఈయన మౌర్యవంశ స్థాపకుడు. చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో కర్ణాటకలోని శ్రావణ బెళగొళలో జీవించాడు. ‘సల్లేఖన వ్రతం’ ద్వారా మరణించాడు. ఈయన క్రీ.పూ. 303లో ‘సెల్యుకస్ నికే టర్’తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా మౌర్య సామ్రాజ్యానికి ఎక్కువ ప్రయోజనం కలిగింది.
బిందుసారుడు (క్రీ.పూ. 298-273): ఈయన చంద్రగుప్త మౌర్యుడి కుమారుడు. బిందుసారుడికి ‘అమిత్రఘాత’, ‘సింహసేనుడు’ అనే బిరుదులు ఉన్నాయి. ఈయన రాజ్యాన్ని మైసూరు వరకు విస్తరించాడు. చాణక్యుడు కొంత కాలంపాటు బిందుసారుడికి కూడా మహామంత్రిగా ఉండి ఆయనకు రాజ్య రక్షణలో సాయపడినట్లుగా టిబెట్ చరిత్రకారుడు తారానాథ్ పేర్కొన్నారు. బిందుసారుడి పాలనా కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగింది. ఈయన ఆజ్ఞ ప్రకారం అశోకుడు తక్షశిలకు వెళ్లి శాంతి నెలకొల్పాడు. బిందుసారుడు గ్రీకు రాజ్యాలతో స్నేహ సంబంధాలు పెంపొందించాడు.
అశోకుడు (క్రీ.పూ. 273-232): ఈయన బిందుసారుడి కుమారుడు. అశోకుడు పట్టాభిషేకం చేసుకున్న తొమ్మిదేళ్లకు (క్రీ.పూ. 262- 61లో) సామ్రాజ్యకాంక్షతో కళింగ రాజ్యంపై దండెత్తి జయించాడు. ఈ యుద్ధం ‘ధర్మాశోకుడు’గా పూర్తిగా పరివర్తనం చెందడానికి కారణమైంది. ఆ తర్వాత ఉపగుప్తుడు అనే బౌద్ధ ఆచార్యుడి వద్ద అశోకుడు బౌద్ధమత దీక్ష స్వీకరించాడు. ధర్మప్రచారానికి పూనుకొని ‘దేవానాం ప్రియ’, ‘ప్రియదర్శిని’ బిరుదులు పొందాడు. బానిసలు, సేవకుల పట్ల కరుణ, తల్లిదండ్రులు, పెద్దల పట్ల విధేయత, గురువుల పట్ల గౌరవం, స్నేహితులు, బంధువులు, పరిచయస్థుల పట్ల ఔదార్యం, పురోహితులు, భిక్షువుల పట్ల ఆదరణ అనేవి అశోకుడు ప్రబోధించిన ‘ధర్మం’లోని సూత్రాలు. ‘అహింసా’ అనేది ‘ధర్మం’లోని ముఖ్యసూత్రం. అశోకుడు 42 ఏళ్లు పరిపాలించి క్రీ.పూ. 232లో మరణించాడు.

వివిధ శాసనాల ఆధారంగా అశోకుడి సామ్రాజ్య సరిహద్దుల గురించి తెలుస్తోంది. షహాబద్‌గిరి, మాన్‌షేషరా శాసనాలు వాయవ్య సరిహద్దును, రుమిందై శాసనం ఈశాన్య సరిహద్దును, సొపారా, గిర్నార్ శాసనాలు పశ్చిమ సరిహద్దును తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. బబ్రూ శాసనం అశోకుడి బౌద్ధమత స్వీకారం గురించి, ధౌలీ, జునాగడ్ శాసనాలు ఉదాత్త రాజ ధర్మ స్వరూపం గురించి, బరాబర్ శాసనం పరమత సహనం గురించి, 13వ శిలాశాసనం కళింగ యుద్ధం గురించి తెలుపుతున్నాయి. మస్కీలో అశోక అనే పదం ఉంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుడి పాలన గురించి కళింగ శాసనం ద్వారా తెలుస్తోంది. రుమిందై, ఇగ్లివ శాసనాలు అశోకుడికి బుద్ధుడిపై ఉన్న గౌరవాన్ని వివరిస్తాయి. తరాయి శాసనం అశోకుడికి బౌద్ధమతంపై ఉన్న గౌరవాన్ని తెలుపుతుంది.
అన్ని మతాల సారాంశం ఆధారంగా అశోకుడు కొన్ని సూత్రాలతో దమ్మను తయారు చేశాడు. ఈయన దమ్మ ప్రచారం కోసం ధర్మమహామాత్రులు అనే ప్రచారకులను పంపిస్తే వారు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశారు. భారత ఉపఖండంలో అశోకుడు వేయించిన 14 ప్రధాన శిలా శాసనాలు, ఏడు స్తంభ శాసనాలు, అనేక చిన్నరాతి శాసనాలు లభించాయి. ఇందులో చాలావాటిపై ప్రజల కోసం చేసిన ప్రకటనలు చెక్కారు. 14 శిలా శాసనాలు అశోకుడి దమ్మ సూత్రాల గురించి తెలుపుతున్నాయి. మస్కీ శాసనంలో ‘దేవానాం ప్రియ’ అని ఉంది.
మౌర్య వంశ చివరి పాలకులు (క్రీ.పూ. 232 - 185): అశోకుడి తర్వాత వచ్చిన రాజులు అర్ధ శతాబ్దం పాటు పాలించారు. మౌర్య వంశ చివరి రాజైన బృహద్రధుడిని ఆయన సేనాని పుష్యమిత్రుడు వధించి మగధను ఆక్రమించడంతో వీరి పాలన అంతమైంది. 

మౌర్యుల పాలనా వ్యవస్థభారతదేశంలో ప్రప్రథమంగా కేంద్రీకృత అధికారాలు కలిగిన నిర్దిష్టమైన పరిపాలన రూపొందించింది మౌర్య చక్రవర్తులే. వీరికి పాలనలో సలహా కోసం మంత్రితో పాటు పరిషత్తు ఉండేది. పాలనా సౌలభ్యం కోసం సామ్రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించి వాటికి రాజప్రతినిధులను నియమించారు. భూమిశిస్తు ప్రభుత్వ ప్రధాన ఆదాయం. పంట దిగుబడిలో 4 నుంచి 6వ వంతు వరకు శిస్తు వసూలు చేసేవారు. పాటలీపుత్ర నగర పాలన ముప్ఫై మంది సభ్యులున్న బోర్డు నిర్వహణలో ఉండేది. వర్తకుల ‘శ్రేణులు’ బ్యాంకులుగా పనిచేశాయి. సమాజంలో బహు భార్యత్వం, కన్యల విక్రయం, సతీసహగమనం లాంటి దురాచారాలు ఉండేవి. ఈ కాలంలో స్త్రీల స్థాయి తగ్గింది. మౌర్యులు ఎక్కువగా ప్రజల భాష అయిన ప్రాకృతాన్ని ఉపయోగించారు. శిలా శాసనాల్లో ‘ఖరోష్టి’, ‘బ్రాహ్మి’ లిపులను వాడారు.




ప్రాచీన భారతదేశ పట్టణీకరణ

రాఖీగర్హ్‌, మొహంజొదారో, కాళీభంగన్, దోలవీరాలను పరిశీలించాక పట్టణ ప్రణాళిక విషయంలో ఆనాటి పట్టణాల్లో ఏకరూపత ఉన్నట్లు తెలుస్తోంది. నగరాల్లో పశ్చిమ వాయవ్య ప్రాంతాలు ఎత్తుగా ఉండి, తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు పల్లంగా కనిపిస్తున్నాయి. ఎత్తుగా ఉండే ప్రాంతాన్ని కోట అని పిలిచారు. కోట్‌డిజి వంటి వాటి ద్వారా కోట చుట్టూ ఆగడ్త ఉండటమే కాకుండా, కోట పై భాగంలో బురుజులున్నాయి అని తెలుస్తోంది. 12-14 అడుగుల ఎత్తు వరకు ప్రాకారాలు సురక్షితంగా ఉన్నట్లు అవగతమవుతోంది.
మొహంజొదారోలో స్నానవాటిక, రెండు స్థూపాలు, స్తంభ మండపం, కళాశాల భవనం వంటి నిర్మాణాలను గుర్తించారు. హరప్పాలో దిగువ భాగాన ఒక గ్రామం, ఒక దిబ్బ ఉండి, దిబ్బకు తూర్పు వైపున పోలీస్‌స్టేషన్ వంటి నిర్మాణ విశేషాన్ని కనుగొన్నారు. ప్రధాన వీధులు 4 నుంచి 6 మీటర్ల వరకు వెడల్పుతో ఉండేవి. రోడ్లన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు ఒకదానికొకటి లంబ కోణంలో ఉన్నాయి. లోథాల్ (గుజరాత్) వంటి పట్టణాల్లో కుమ్మరులు, లోహ కర్మ, శిలాకర్మలు చేసే వారి కార్ఖానాలు ఏర్పడ్డాయి.
పట్టణాలన్నింటిలో రోడ్ల పక్కన మురుగునీటి కాల్వలను నిర్మించారు. ఈ కాల్వల తయారీకి కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. ఈ మురుగు నీటి కాల్వలను బాగు చేయడానికి అనువుగా నియమిత అంతరాల్లో మనిషి దిగడానికి కావాల్సిన రంధ్రాలను ఏర్పర్చారు. అదేవిధంగా ఎక్కువగా పారిన నీరు ఇంకడానికి చిన్న చిన్న గోతులను తవ్వారు.
ప్రత్యేక నిర్మాణాలు
మొహంజొదారోలో గొప్ప స్నాన వాటిక, స్తంభ మండపం, హరప్పాలో ధాన్యాగారాలు, లోథాల్‌లో ఓడరేవును గుర్తించారు. మొహంజొదారోలోని స్నానవాటిక 30×23×8 అడుగుల కొలతలతో నిర్మితమైంది. దీని గోడలు నీరు ఇంకకుండా ఏర్పడ్డాయి. దీనికి ఒకవైపు మెట్లవరుస, గ్యాలరీలా కూర్చోవడానికి వీలుగా నిర్మాణాలు ఉన్నాయి. దీనికి పైభాగంలో కొన్ని వరండాలు, గదులు కూడా ఉన్నాయి. హరప్పాలోని ధాన్యాగారాలను 50×20 అడుగుల కొలతతో ఆరు నిర్మాణాలను నదీ తీరాన నిర్మించారు. రెండు వరుసల్లో మొత్తం 12 ధాన్యాగారాలు ఉన్నాయి. లోథాల్ ప్రసిద్ధ ఓడరేవు. దీన్ని నదికి జతపరుస్తూ కృత్రిమ కాల్వలను తవ్వారు. ఈ నిర్మాణాలన్నింటికి ఒకే కొలతతో కూడిన కాల్చిన ఇటుకలను వాడారు. ఇటుకలు 11×5.5×2.75 అంగుళాల్లో, 4 : 2 : 1 నిష్పత్తిలో పొడవు, వెడల్పు, మందాన్ని కలిగి ఉండేవి.
నగర వ్యవస్థపై సామాజిక ప్రక్రియల ప్రభావం
నాగరికత కాలాల్లోని కట్టడాల్లో బానిసలను అధిక సంఖ్యలో వినియోగించినట్లు వాల్టేర్ రూబెన్ అభిప్రాయం. ఇళ్ల పరిమాణాల్లోని మార్పులు, వివిధ విలాసాల ఉనికిని బట్టి కొందరు చరిత్రకారులు సమాజంలోని అంతరాలను ఊహించారు. సామాజిక ప్రక్రియలో ప్రయోజనాత్మక గమనశీలత.. పట్టణ నిర్మాణ వ్యవస్థ, ప్రణాళికలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేయగా నగర, గ్రామ సంబంధాలు పట్టణ వ్యవస్థ అస్థిత్వానికి దోహదపడ్డాయి. కానీ వ్యవసాయక వృత్తుల ప్రాముఖ్యత కలిగిన గ్రామీణ నిర్మాణాల గురించి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు.
రెండో పట్టణీకరణ
క్రీ.పూ. 600-300 మధ్యకాలంలో గంగానది లోయలో చోటు చేసుకున్న పట్టణీకరణను భారత ఉపఖండంలో రెండో పట్టణీకరణగా పేర్కొంటారు. రాజ్‌గాట్, చిరంద్ తవ్వకాల్లో లభ్యమైన ఆధారాలను బట్టి ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో, బీహార్ పశ్చిమ ప్రాంతంలో ఇనుము వినియోగం విస్తృతంగా ఉండేదని తెలుస్తోంది. ఈ ఇనుము వాడకం విశాల సామ్రాజ్య స్థాపనకు దారి తీసింది. ఈ సామ్రాజ్యాలన్నీ సైనికపరంగా ఆయుధ సంపత్తితో కూడుకొన్నవి. వీటిలో యుద్ధవీరుల వర్గం ప్రధాన పాత్ర పోషించింది. కొత్త వ్యవసాయ పనిముట్లు రైతులు అధిక ఉత్పత్తి చేయడానికి దోహదం చేశాయి. ఈ ఉత్పత్తులు పాలక వర్గ అవసరాలను తీర్చడమే కాకుండా అసంఖ్యాకమైన ఇతర నగరాలను పోషించాయి. ఈ భౌతిక వస్తు వినియోగశక్తి కోసల, మగధ సామ్రాజ్యాల విస్తరణకు దోహదం చేసింది. వైదికేతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఈ సామ్రాజ్యాల్లో కలిసిపోయారు. తద్వారా కొత్త సామ్రాజ్యాలు పరిపాలనా సంబంధమైన కొత్త సమస్యలను, సామాజికంగా ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొన్నాయి.
పాళీ, సంస్కృత గ్రంథాల్లో పేర్కొన్న అనేక నగరాలు కౌశాంబి, శ్రావస్తి, అయోధ్య, కపిలవస్తు, వారణాసి, వైశాలి, రాజగిరి, పాటలీపుత్రం మొదలైనవి తవ్వకాల్లో బయటపడ్డాయి. ఆవాసాలు, మట్టి నిర్మాణాల చిహ్నాలు కన్పించాయి. వాస్తవానికి ఇవి భారతదేశంలో రెండో నగరీకరణ ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. మొత్తం దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటే శ్రావస్తి లాంటి పెద్ద నగరాలు దాదాపు 20 వరకు ఉంటాయి. తర్వాత కాలంలో నగరాలు గణనీయంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం గ్రీకు నుంచి అలెగ్జాండర్ సైన్యం భారతదేశానికి తరలి రావడమేనని గుర్తుంచుకోవాలి. దీనివల్ల అనేక వ్యాపార రవాణా మార్గాలు ఏర్పడ్డాయి. వాయవ్య భారతదేశం, పశ్చిమ ఆసియాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయి.
నగర ఆర్థిక వ్యవస్థ
నగరాల ఆవిర్భావానికి కారణాలు (రాజకీయ, ఆర్థిక, మతపరమైనవి) విభిన్నంగా ఉన్నప్పటికీ చివరికి ఈ నగరాలన్నీ మంచి వ్యాపార కేంద్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వాటిలో రకరకాల వృత్తి నిపుణులు, వ్యాపారులు స్థిరపడ్డారు. వీరు కొన్ని సంఘాలుగా ఏర్పడ్డారు. జాతక కథల్లో అంటే బుద్ధుడి పుట్టుకకు సంబంధించిన కథల్లో ఇలాంటి సంఘాలను దాదాపు 18 వరకు పేర్కొన్నారు. అందులో నాలుగు పేర్లు (వడ్రంగులు, కుమ్మరులు, తోలుపని చేసేవారు, చిత్రకారులు) మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రతి సంఘం నగరంలో ఒక ప్రత్యేక ప్రాంతంలో నివసించేది. అంటే ఇలాంటి నివాసాలు, పరిశ్రమలు వృత్తుల స్థానికీకరణకు తోడ్పడటమే కాకుండా వారసత్వంగా తండ్రుల నుంచి వారి సంతానానికి సంక్రమించడానికి ఈ కళలు దోహదపడ్డాయి. సాధారణంగా వ్యాపారులంతా నగరాల్లోనే జీవించేవారు. కానీ వ్యాపారులు జీవనోపాధి కోసం రాజు జారీ చేసిన మాన్యాలు (భోగ గ్రామాలు) చేసుకోవడానికి గ్రామాలతో సంబంధం పెట్టుకోక తప్పలేదు. ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులు చేస్తున్న సేవలను బట్టి పరమ నిరంకుశులైన రాజులు కూడా వారిని తగిన రీతిలో గౌరవించేవారు. వీటన్నింటినీ గమనిస్తే వృత్తి నిపుణులు, వ్యాపారులు నగరాల్లో ప్రధానమైన సామాజిక వర్గాలుగా అభివృద్ధిలోకి వచ్చారన్న విషయం అవగతమవుతోంది.
వృత్తి నిపుణులు తయారుచేసిన వస్తువులను వ్యాపారులు సుదూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించేవారు. జాతక కథల్లో 500 బండ్లకు సరిపోయే వస్తువులు, వస్త్రాలు, దంతపు వస్తువులు, కుండలు మొదలైనవి తీసుకెళ్లినట్లు ప్రస్తావించారు. ఆ కాలంలో అన్ని ప్రధాన నగరాలు నదీ తీరాలకు ఆనుకునే ఉండేవి. వాటిని కలుపుతూ వ్యాపార మార్గాలు చాలా ఏర్పడ్డాయి. ఉదాహ‌రణ‌కు శ్రావస్తి పట్టణాన్ని కౌశాంబి, వారణాసి, కపిలవస్తు, కుశినార మొదలైన నగరాలతో అనుసంధానం చేశారు. లోహాలతో తయారైన నాణేలు మొట్టమొదట ఈ కాలంలోనే కన్పిస్తాయి. వైదిక గ్రంథాల్లో కనిపించే నిష్క, శతమాన అనే పదాలను నాణేల పేర్లుగానే గుర్తించినప్పటికీ అప్పటికే దొరికిన నాణేలు క్రీ.పూ. 6వ శతాబ్ది నాటి కంటే పాతవి మాత్రం కావు. ఈ కాలంలో మొట్టమొదటి దశలో నాణేలు చాలావరకు వెండితో తయారుచేశారు. కొన్ని రాగి నాణేలు కూడ లభించాయి. లోహ నాణేలపైన కొన్ని గుర్తులు అంటే.. కొండలు, చెట్లు, చేప, వృషభం మొదలైన చిహ్నాలతో రంధ్రాలు చేయడం వల్ల వీటిని రంధ్రపు గుర్తులున్న నాణేలనేవారు. పాళీ గ్రంథాలు ధనాన్ని విస్తారంగా ఉపయోగించేవారని, జీతభత్యాలు ధనరూపంలోనే చెల్లించేవారనీ పేర్కొన్నాయి.
అశోకుడికి ముందు రెండు శతాబ్దాల కిందటే ప్రారంభమైన లిపి కూడా వ్యాపారాభివృద్ధికి చాలా దోహదం చేసింది. ఈ కాలంలో గ్రంథాలన్నీ కొలతలకు సంబంధించిన సునిశిత పరిజ్ఞానాన్ని వివరించాయి. బహుశా ఇవి ఇళ్లు, భూముల సరిహద్దుల గుర్తింపులకు, నిర్మాణాలకు ఉపయోగపడి ఉంటాయి. ఆ విధంగా లేఖనం అనేది చట్టాలు, మతాచారాల సంకలనానికి మాత్రమే కాకుండా వ్యాపార వివరాలు, పన్నుల చెల్లింపు, విస్తృతమైన సైనిక ఉద్యోగుల వివరాలు రాసి పెట్టుకోవడానికి అవకాశం కల్పించింది. కానీ ఈ కాలంలో లిపి ఉండేదనే విషయానికి సంబంధించి ఎలాంటి పురావస్తు ఆధారాలు లేవు. అయితే ఈ ప్రాచీన రికార్డులను శిలలు, లోహపు ఫలకాలపై రాయకపోవడం వల్ల అవి నాశనమై ఉండొచ్చని అందుకే అవి అలభ్యాలని చెప్పొచ్చు.
మౌర్యుల తర్వాత పట్టణీకరణ
వ్యాపారం అభివృద్ధి చెందడం, ద్రవ్య ఆర్థిక విధానం విస్తరించడం పట్టణీకరణకు కారణభూతమయ్యాయి. చైనా యాత్రికులు తమ రచనల్లో పాటలీపుత్రం, వైశాలి, వారణాసి, కౌశాంబి, హస్తినాపురం, మధుర, ఇంద్రప్రస్థం మొదలైన నగరాలను పేర్కొన్నారు. కుషాణుల కాలంలో చిరండ్, సోన్‌పూర్, బక్సార్ (బీహార్), తూర్పు ఉత్తరప్రదేశ్‌లో ఖేరత్, మాసన్, ఉత్తరప్రదేశ్‌లో సోహ్‌గౌరా, భీటా, కౌశాంబి, శృంగవేర్‌పూర్, ఆంత్రజిఖేరా, మీరట్, మజఫర్‌పూర్ ప్రాంతాలు సంపదలతో తులతూగేవి. అదేవిధంగా పంజాబ్‌లోని జలంధర్, లూథియానా, రూపార్‌ల్లో కూడా కుషాణుల కాలం నాటి నిర్మాణాలు బయటపడ్డాయి. మొత్తం మీద కుషాణుల కాలంలో నగరీకరణ అత్యున్నత స్థాయికి చేరుకుంది. పశ్చిమ భారతదేశంలో మాళ్వా ప్రాంతాన్ని పరిపాలించిన శకుల నగరాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వారి ప్రధాన నగరం ఉజ్జయిని. కౌశాంబి నుంచి మధుర, మధుర నుంచి పశ్చిమ తీర ప్రాంతానికి వచ్చే రెండు ప్రధాన రహదారులు ఉజ్జయినిలో కలవడం వల్ల ఆ నగరానికి అధిక ప్రాధాన్యత లభించింది. దీనికితోడు ఉజ్జయిని అతి విలువ కలిగిన ఆగేట్, కార్నిలియన్ రాళ్ల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. క్రీ.పూ. 200 నుంచి ఇక్కడ కార్నిలియన్, జాస్పర్ రాళ్లతో పూసల్ని తయారు చేసేవారని తవ్వకాలు నిరూపిస్తున్నాయి. క్షిప్రా నదీ గర్భంలో పుష్కలంగా ముడిసరుకు లభించడం వల్ల ఈ పరిశ్రమ గొప్పగా వర్థిల్లింది.
శకులు, కుషాణుల యుగంలా శాతవాహనుల కాలంలో టగర్, పైఠాన్, ధాన్యకటకం, అమరావతి, నాగార్జునకొండ, బరూచ్, సొపారా, అరికమేడు, కావేరిపట్నం ప్రసిద్ధి చెందాయి. తెలంగాణలో ఫణిగిరి, మునుల గుట్ట, పోతన్ ప్రసిద్ధి చెందిన బౌద్ధ పట్టణాలని ‘ప్లిని’ అనే చరిత్రకారుడు తన రచనల్లో పేర్కొన్నారు.
గుప్తుల యుగం నాటి పట్టణీకరణ క్షీణత - ప్రభావం
6వ శతాబ్దం నుంచి వ్యాపారం తీవ్రంగా తగ్గు ముఖం పట్టింది. రోమన్ సామ్రాజ్యంతో, పశ్చిమ దేశాలతో వ్యాపారం ఆగిపోయింది. 6వ శతాబ్దంలో ఇరాన్, బైజాంటియన్‌లతో పట్టువస్త్రాల వ్యాపారం ఆగిపోయింది, భారతదేశం.. చైనా, ఆగ్నేయ ఆసియాతో వ్యాపారం కొనసాగించడంలో దళారీలైన అరబ్బుల పాత్ర ప్రధానం. లాభాలు కూడా పూర్తిగా వారే పొందారు. వ్యాపారం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో దేశంలో బంగారం నాణేలు పూర్తిగా తగ్గిపోయాయి. క్రమంగా పట్టణాలు శిథిలం కావడంతో మధుర, శ్రావస్తి, చరంద్, వైశాలి, పాటలీపుత్రం మొదలైన నగరాలు కాలగర్భంలో కలిసినట్లు తవ్వకాలు నిరూపిస్తున్నాయి. భారతీయ ఎగుమతులకు అవకాశాలు తగ్గడం వల్ల చేతివృత్తులవారు, వ్యాపారులు గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లి వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించారు. 5వ శతాబ్దం చివరలో పట్టు నేసేవాళ్లు పశ్చిమ తీరం నుంచి మాళ్వా ప్రాంతంలోని మాంద్‌సోర్‌కు వలస వెళ్లారు. పట్టణాలు శిథిలం కావడం వల్ల, వ్యాపారం తగ్గుముఖం పట్టి గ్రామాలు తమకు కావలసిన నూనె, ఉప్పు, సుగంధద్రవ్యాలు, బట్టలు మొదలైన వస్తువుల్ని సమకూర్చు కోవాల్సివచ్చింది. అందువల్ల ఉత్పత్తి కేంద్రాలు చిన్నవిగా మారి, తమ అవసరాలకు మాత్రమే పరిమితంగా ఉండిపోయాయి. తర్వాత సామాజిక నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. ఉత్తర భారతదేశంలో వైశ్యులను స్వతంత్ర రైతులుగా పరిగణించేవారు. భూదానాలు రాజుకు, రైతుకు మధ్య భూస్వాములను సృష్టించాయి. అందువల్ల వైశ్యులు శూద్రులతో సమానమైపోయారు. ఈ మార్పు ఉత్తర భారతదేశం నుంచి బెంగాల్‌కు, దక్షిణ భారతదేశానికి విస్తరించింది.
వర్ణ వ్యస్థలో మార్పులు
ధర్మశాస్త్రాల ప్రకారం వ్యక్తుల సామాజిక స్థాయి వర్ణంపై ఆధారపడి ఉండేది. ఒక వ్యక్తికి ఉన్న ఆర్థిక హక్కులు కూడా అతని వర్ణంపై ఆధారపడి ఉండేవి. పరిస్థితులు మారిన తర్వాత కొత్త భూస్వామ్య వర్గానికి ఇవ్వాల్సిన స్థానాన్ని గురించి ధర్మశాస్త్ర గ్రంథాల్లో మార్పులు చేశారు.




షోడష మహాజనపదాలు

క్రీ.పూ. 6 శతాబ్దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆనాటి రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితుల ప్రభావం భారతదేశ చరిత్ర మీద ప్రబలంగా ఉంది. ఈ కాలాన్ని మహాజన పదాల యుగం, బుద్ధయుగం, రెండో నగరీకరణ యుగం, మౌర్యుల పూర్వ యుగం అనే పలు పేర్లతో పిలుస్తారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా, వేదకాలపు తెగ ఆధారిత జన పదాలకు భిన్నంగా ప్రాంతం ఆధారిత మహాజనపదాలు (ప్రాదేశిక రాజ్యాలు) ఈ యుగంలోనే ఏర్పడ్డాయి. ఈ కాలంలోనే బుద్ధుడు జీవించాడు, సింధూ నాగరికత పట్టణాల తర్వాత మళ్లీ నగరాల ఆవిర్భావం జరిగింది. ఈ యుగం అంతం కాగానే క్రీ.పూ. 325లో మౌర్య సామ్రాజ్యం ఏర్పడినందున దీన్ని మౌర్యుల పూర్వ యుగం అంటారు.
మహాజనపదాల ఆవిర్భావం
క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రపంచంలోని అత్యంత సారవంతమైన మైదానాల్లో ఒకటైన గంగా మైదానం సాగులోకి వచ్చింది. ఈ కాలంలో విస్తృత స్థాయిలో ఇనుమును ఉపయోగించారు. కొత్త వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి వచ్చి వ్యవసాయంలో మిగులు ఏర్పడింది. దీనివల్ల వ్యాపార వాణిజ్యాలు, నగరాలు అభివృద్ధి చెందాయి. పన్నుల వ్యవస్థకు అవకాశం కలిగింది. ఈ పరిణామాలన్నీ కలిసి ఈ యుగంలో 16 పెద్ద ప్రాదేశిక రాజ్యాల ఏర్పాటుకు దారితీశాయి. బౌద్ధ గ్రంథం అంగుత్తర నికాయలో ఈ 16 రాజ్యాల ప్రస్తావన ఉంది.
  1. అంగ: దీని రాజధాని చంపా. బ్రహ్మదత్తుడిని అంతం చేసి బింబిసారుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
  2. కాశీ: రాజధాని వారణాసి. ఇది వరుణ, ఆసి నదుల సంగమ ప్రాంతం.
  3. కోసల: దీని తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. ఈ రాజులు కాశీని ఆక్రమించారు. రాజ్యం చివరికి మగధలో విలీనమైంది.
  4. వజ్జీ: రాజధాని వైశాలి. ఇది 8 గణ రాజ్యాలతో కూడిన సమాఖ్య. వైశాలి రాజు చేతకుని కుమార్తె చెల్లనను బింబిసారుడు వివాహం చేసుకున్నాడు. ఈ రాజ్యాన్ని చివరికి అజాతశత్రువు అంతం చేశాడు.
  5. మల్ల: దీని రాజధానులు కుశినార, పావ. కుశినారలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. పావలో మహావీరుడు మరణించాడు. ఈ గణ రాజ్యం బుద్ధున్ని బాగా ఆదరించింది. బుద్ధుని శిష్యులు ఆనందుడు, ఉపాలి మొదలైన వారు ఈ రాజ్యానికి చెందినవారే. పావలో సాంతాగార అనే శాసన సభ ఉండేది.
  6. చేది: రాజధాని సుక్తిమతి, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
  7. వత్స: దీని రాజధాని కౌశాంబి, దీని రాజు ఉదయనుడు బౌద్ధ మతాన్ని ఆదరించాడు. హర్షుని ప్రియదర్శిక, రత్నావళితోపాటు అనేక కథల్లో ఇతడు నాయకుడు. అవంతిరాజు పలాక ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
  8. పాంచాల: దీని రాజధానులు అహిచ్ఛత్ర, కంపిల్య.
  9. శౌరసేన: దీని రాజధాని మధుర. గ్రీకు రచనల్లో ఈ రాజ్యాన్ని శౌరసేనాయ్‌గా, రాజధాని మేధోరాగా ప్రస్తావించారు.
  10. మత్స్య: దీని రాజధాని విరాటనగరం. ఈ రాజ్యమూ మగధలో కలిసిపోయింది.
  11. కురు: రాజధాని ఇంద్రప్రస్థ. ఆధునిక ఢిల్లీ పరిసరాల్లోని నగరం. రెండో రాజధాని హస్తినాపూర్
  12. అస్సక/అస్మక: రాజధాని పొదన లేదా పొటన. ఇదే నేటి బోధన్. ఇది షోడష మహాజనపదాల్లోని ఏకైక దక్షిణాది రాజ్యం. ఇది ఆంధ్ర, మహారాష్ర్టలకు విస్తరించింది.
  13. అవంతి: రాజధానులు ఉజ్జయినీ, మహిష్మతి. నంది వర్ధనుడిని ఓడించి మగధ రాజు శిశు నాగుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించాడు.
  14. గాంధార: రాజధాని తక్షశిల. ఈ రాజ్యాన్ని పర్షియన్లు ఆక్రమించుకున్నారు.
  15. కాంభోజ: రాజధాని రాజాపుర.
  16. మగధ: రాజగృహ (గిరివ్రజ), పాటలీ పుత్ర రాజధానులు.
బుద్ధుని కాలానికి పైన పేర్కొన్న 16 జనపదాల్లో కేవలం నాలుగు రాజ్యాలు మాత్రమే ఉండేవి. అవి.. వత్స, అవంతి, కోసల, మగధ. మిగిలిన రాజ్యాలన్నీ ఈ నాలుగు రాజ్యాల్లో విలీనమైపోయాయి. అయితే క్రీ.పూ. 4వ శతాబ్దాల్లో ఈ నాలుగు రాజ్యాలూ విలీనమై మగధ సామ్రాజ్యం అవతరించింది.

మగధను పాలించిన రాజవంశాలుక్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి క్రీ.పూ. 4వ శతాబ్దం (మౌర్య సామ్రాజ్యం ఏర్పడే) వరకు మగధను మూడు రాజవంశాలు పాలించాయి.

హర్యాంక వంశం (544-413)బింబిసారుడు: ఇతనితో ప్రారంభమైన మగధ సామ్రాజ్య వాదం అశోకుడి కళింగ యుద్ధం వరకు కొనసాగింది. ఇతడు అంగను జయించి తన కుమారుడు అజాతశత్రువును రాజ ప్రతినిధిగా నియమించాడు. కోసల రాజు ప్రసేనజిత్ చెల్లెలు కోసలదేవిని వివాహం చేసుకుని కాశీని పొందాడు. వైశాలీ లిచ్ఛవీ రాజు చేతకుని కుమార్తె చెల్లనను, పంజాబ్‌ను పాలించే మాద్రా రాకుమార్తె ఖేమాను వివాహం చేసుకోవడం ద్వారా పశ్చిమ, ఉత్తర దిశలో తన రాజ్య విస్తరణ మార్గాన్ని సుగమం చేసుకున్నాడు. తన ప్రధాన శత్రువు చండ ప్రద్యోత మహాసేనుడి వద్దకు తన ఆస్థాన వైద్యుడు జీవకుడిని పంపి కామెర్ల వ్యాధి నుంచి విముక్తున్ని చేసి తన మిత్రునిగా చేసుకున్నాడు. గాంధార రాజు పుష్కర సరీన్ కూడా తన రాయబారిని పంపి బింబిసారుడితో స్నేహం చేసుకున్నాడు. ఇతడు బుద్ధుని సమకాలికుడైనా ఇతడు ఏ మతాన్ని ఆదరించాడనే దానిపై స్పష్టత లేదు. బౌద్ధ, జైన మతాలు రెండూ ఇతన్ని తమ మతానికి చెందినవాడేనని పేర్కొన్నాయి. 

అజాతశత్రువు: తండ్రిని హత్య చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. తీవ్రమైన సామ్రాజ్య వాద విధానాన్ని అవలంబించాడు. కోసలరాజు, తన మేనమామ ప్రసేనజిత్‌కు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. విజయం సాధించి కోసల రాకుమార్తెను వివాహం చేసుకోవడంతో పాటు కాశీని తిరిగి పొందాడు. వైశాలీ లిచ్ఛవుల నాయకత్వంలోని 36 రాజ్యాల కూటమికి వ్యతిరేకంగా 16 ఏళ్లు యుద్ధం చేసి విజయం సాధించాడు. ఇతడు మొదట జైనాన్ని, తర్వాత బౌద్ధాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. అందుకే బుద్ధున్ని కలిసి తన తండ్రిని చంపిన నేరాన్ని అంగీకరించాడు. వీరి సమావేశానికి సంబంధించిన ఆధారాలు బార్హుత్ శిల్పాల్లో ఉన్నాయి. ఇతని కాలంలో మొదటి బౌద్ధ సంగీతి జరిగింది. అతనికి కునిక అనే బిరుదు ఉంది.

ఉదయనుడు: ఇతడు పాటలీ గ్రామంలోని గంగ, సోన్ నది సంగమ స్థానంలో కోటను నిర్మించాడు. కాబట్టి ఇతడిని పాటలీ పుత్ర నగర నిర్మాతగా భావిస్తారు. 

శిశునాగ వంశం (413-364)
శిశునాగుడు: 
ఉదయనుడి తర్వాత నలుగురు పితృ హంతకులు రాజులుగా వచ్చారు. వీరితో విసిగిపోయిన ప్రజలు కాశీలో రాజప్రతినిధిగా ఉన్న శిశునాగున్ని రాజుగా చేసినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు రాజధానిని వైశాలికి మార్చాడు. అవంతి రాజు ప్రద్యోతను ఓడించి అవంతి రాజ్యాన్ని మగధలో కలిపేయడం ఇతని గొప్ప విజయంగా పేర్కొంటారు. దీంతో ఈ రాజ్యాల మధ్య వంద సంవత్సరాలుగా సాగిన వైరం అంతమైంది.

కాలాశోకుడు: ఇతడు రాజధానిని పాటలీపుత్రానికి తిరిగి మార్చాడు. ఇతని కాలంలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. ఇతడిని సేనాపతి మహా పద్మనందుడు హత్య చేసి నంద వంశాన్ని స్థాపించాడు. 

నందవంశం (364-321) మగధను పాలించిన అత్యంత బలమైన వంశం నందవంశం. 
మహాపద్మనందుడు: ఇతడు శూద్ర మహిళకు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అనేక క్షత్రియ రాజు కుటుంబాలను రూపుమాపి రెండో పరశురాముడిగా ప్రసిద్ధి చెందాడు. ఖారవేలుని హాథిగుంఫ శిలాశాసనం ప్రకారం ఇతడు కళింగను జయించి విజయ చిహ్నంగా అక్కడి నుంచి జైన తీర్థంకరుని విగ్రహం తెచ్చినట్లు తెలుస్తుంది. ఇతడు ఏకరాట్ అనే బిరుదును ధరించాడు.
ధననందుడు: మహా పద్మనందుడి తర్వాత అతని ఎనిమిది మంది కుమారులు పాలించారు. వారిలో చివరివాడు ధననందుడు. ఇతనికి రెండు లక్షల పదాతి దళం, 20 వేల అశ్విక దళం, 3వేల గజ దళం, 2వేల రథబలం ఉండేది. అలెగ్జాండర్ సేనలు బియాస్‌ను దాటి భారత్‌పై దండెత్తకపోవడానికి వీరి బలసంపత్తి కూడా ఒక కారణం. అయితే ఇతనికి మితిమీరిన ధనకాంక్ష ఉండేదని దానివల్ల ప్రజలను పీడించి వారి మద్దతు కోల్పోవడం వల్ల, ఈ పరిస్థితులను అనువుగా చేసుకొని చంద్రగుప్త మౌర్యుడు ఇతన్ని అంతమొందించి మౌర్య వంశ స్థాపన చేశాడు.

బుద్ధయుగంలోని గణతంత్ర రాజ్యాలుఈ కాలం నాటి పాలి గ్రంథాల్లో ఆనాడు మనుగడలో ఉన్న కొన్ని గణతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉంది. ఈ రాజ్యాల్లో కొన్ని షోడష మహాజనపదాల్లోనూ కనిపిస్తాయి.
  • నాటి గణరాజ్యాల్లో ప్రధానమైనవి కపిలవస్తు, కుశినార, పావ, వైశాలి మొదలైనవి.
  • కపిలవస్తును శాక్యవంశం పాలించేది. ఇది భారత్-నేపాల్ సరిహద్దు రాజ్యం. బుద్ధు డు ఈ వంశానికి చెందినవాడు. కోసల రాజు విరుధకుడు ఈ రాజ్యాన్ని అంతం చేసి శాక్యలను ఊచకోత కోశాడు.
  • కుశినార, పావ రాజధానులుగా మల్ల వం శం పాలించేది. అజాతశత్రువు ఈ రాజ్యా న్ని అంతం చేశాడు.
  • వైశాలి రాజధానిగా లిచ్ఛవీలు పరిపాలించారు. వీరు స్వేచ్ఛా పిపాసులు, యుద్ధ పిపాసులు. అందుకే అజాతశత్రువుకు ఈ రాజ్యాన్ని ఆక్రమించేందుకు 15 సంవత్సరాలు పట్టింది. అజాతశత్రువు ఈ యుద్ధం లో విజయం సాధించినా లిచ్ఛవీలు తీవ్రనష్టాన్ని కలిగించారు. వీరి సమావేశ మందిరం పేరు సాంతాగార, ఇందులో 7707 మంది ప్రతినిధులు పాల్గొనేవారు.
భారతదేశంపై విదేశీ దండయాత్రలు
షోడష మహా జనపదాల్లోని 16 రాజ్యాల్లో అత్యధిక రాజ్యాలు భారత్‌లోని ప్రధాన భూ భాగంలో ఉన్నాయి. వాయవ్య భారతదేశంలో కాంభోజ, గాంధార, మాద్రా రాజ్యాలుండేవి. వీరి మధ్య ఉన్న రాజకీయ అనైక్యత.. పర్షియాను పాలించే ఆకియేనియన్ రాజులు భారత్‌ను ఆక్రమించేందుకు పురిగొల్పింది. 

పర్షియన్ దండయాత్రలుసైరస్: క్రీ.పూ. 6వ శతాబ్దంలో పర్షియారాజు సైరస్ భారత్‌పై దండెత్తి సింధూ నదికి పశ్చిమంలోని కాబూల్ వరకు ఉన్న ప్రాంతాన్నంతా ఆక్రమించాడు. భారత దేశంపై దండయాత్ర చేసిన తొలి విదేశీ పాలకుడు సైరస్. ఇతడు కపీసా అనే నగరాన్ని ధ్వంసం చేసినట్లు కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది. 
డేరియస్- 1: సైరస్ మనవడు. ఇతడు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఈ దండయాత్రలో పాల్గొన్న ఇతని సేనాని స్కైలస్. హిరోడోటస్ అనే గ్రీకు చరిత్రకారుడు పర్షియన్ సామ్రాజ్యంలోని 28 సాత్రపిల్లో(రాష్ట్రాల్లో) సింధూ రాష్ర్టం 20వ సాత్రపిగా ఉందని తెలిపాడు.
జెక్జెస్: ఇతని కాలంలో భారత సేనలను గ్రీసులోని తన ప్రత్యర్థులతో పోరాడేందుకు నియమించారు.
డేరియస్-3: అలెగ్జాండర్‌తో పోరాడేందుకు భారతీయ సైనికుల్ని తన సైన్యంలో చేర్చుకున్నాడు.
భారత్‌పై పర్షియన్ దండయాత్రల వల్ల భారత్‌కు పర్షియాకు మధ్య వ్యాపార వాణిజ్యాలకు గొప్ప ఊపు లభించింది. పర్షియన్ ప్రభావం వల్లనే భారతీయులు ఖరోష్టి అనే ఒక నూతన లిపిని నేర్చుకున్నారు. మౌర్యుల శిల్పకళ మీద కూడా ఆకియేనియన్ శిల్పకళ ప్రభావం ప్రబలంగా ఉంది. ఇరానియన్ల ద్వారా భారత సంపద గురించి తెలుసుకున్న గ్రీకులు చివరికి అలెగ్జాండర్ నాయత్వంలో భారత్‌పై దాడి చేశారు. 

మాసిడొనియన్ దండయాత్రలుపర్షియన్ల తర్వాత భారత్‌పై దండెత్తిన రెండో విదేశీయులు గ్రీకులు. అలెగ్జాండర్ 20 ఏళ్ల వయసులో క్రీ.పూ. 334లో మాసిడొనియాకు రాజయ్యాడు. 329 నాటికి 3వ డేరియస్‌ను అంతంచేసి పర్షియా సామ్రాజ్యాన్ని ఆక్రమించాడు. 328లో కాబూల్‌ను ఆక్రమించాక 327లో కైబర్ కనుమల ద్వారా హిందూకుష్ పర్వతాలను దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. అలెగ్జాండర్ బాక్ట్రియాలో ఉండగా తక్షశిల రాజకుమారుడు అంభి ఆహ్వానం లభించింది. జీలం, చినాబ్ ప్రాంతాల్లోని రాజైన పోరస్‌కు తక్షశిల రాజులకు మధ్య ఉన్న వైరం ఈ ఆహ్వానానికి కారణం. అలెగ్జాండర్ ఓహింద్ వద్ద సింధూ నదిని దాటాడు. క్రీ.పూ. 326కు జీలం నదిని (హైడాస్పస్) చేరాడు. అప్పటికీ తక్షశిలకు రాజుగా ఉన్న అంభి తన మద్దతును అందించాడు. ఇరు సేనలకు కార్సీ మైదాన ప్రాంతంలో భీకర యుద్ధం జరిగింది. పోరస్ ఓడినా అతని ధైర్య సాహసాలు మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అప్పగించాడు. ఈ విజయానికి గుర్తుగా యుద్ధం జరిగిన ప్రదేశంలో బుకెషాలా, నికేయా నగరాలు నిర్మించాడు. ఈ విజయం తర్వాత అలెగ్జాండర్ బియాస్ నది ఒడ్డుకు చేరుకున్నాడు. బియాస్‌ను దాటి మగధపై దాడి చేయాలని భావించాడు. అప్పటికే సుదీర్ఘ కాలం మాతృభూమికి దూరంగా ఉన్న సేనలు అలెగ్జాండర్ ఆదేశాలను నిరాకరించాయి. దాంతో అలెగ్జాండర్ తన సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని నియార్కస్ నాయకత్వంలో సముద్ర మార్గం ద్వారా, మరో భాగాన్ని తన స్వీయనాయకత్వంలో భూమార్గం ద్వారా వెనుతిరిగాడు. మార్గమధ్యమంలో బాబిలోనియా వద్ద క్రీ.పూ. 323 జూన్‌లో 33 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించాడు.

భారతదేశాన్ని జయించాలనే అలెగ్జాండర్ కోరిక పూర్తిగా నెరవేరకపోయినా అనేక అంశాల్లో ఈ దండయాత్ర ప్రభావం ఉంది. ఈ దండయాత్ర వల్ల పంజాబ్, దాని పరిసర ప్రాంతాల్లోని ఆటవిక తెగలు బలహీన పడ్డాయి. దాంతో చంద్రగుప్త మౌర్యుడు సులువుగా ఆ తెగలను జయించి తన సామ్రాజ్య విస్తరణ చేయగలిగాడు. ఈ దండయాత్ర వల్లనే భారతదేశానికి ఐరోపా దేశాలకు మధ్య భూ, సముద్ర మార్గాలకు అవకాశం కలిగింది. భారత దేశ చరిత్ర రచనలోనూ అలెగ్జాండర్ చరిత్రకారుల రచనలు ఎంతో ఉపయోగపడ్డాయి.



ప్రాచీన భారతదేశ చరిత్ర

అహింసా సిద్ధాంతం బౌద్ధ మతం నుంచి ఆవిర్భవించిందే. తర్వాతి కాలంలో దీన్ని గాంధీ మహాత్ముడు అనుసరించారు. బుద్ధ విగ్రహాలు గాంధార శిల్ప కళారీతిలో ఉంటాయి. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మానవ విగ్రహాల పూజ బౌద్ధ మతంలోనే ప్రారంభమైంది. స్థానిక భాషలకు ఈ మతం బాగా ప్రోత్సాహాన్ని అందించింది.
వేదకాల నాగరికత (క్రీ.పూ. 2000-1500)ఆర్యులు ఆసియా మైనర్, మెసపటోమియా మీదుగా పర్షియాలోకి ప్రవేశించారు. ఆ తర్వాత బాక్ట్రియా, హిందూకుష్ పర్వత శ్రేణుల మీదుగా భారతదేశంలోకి వచ్చారు. పంజాబ్ ప్రాంతంలోని సప్తసింధు లోయను మొదటి స్థావరంగా చేసుకుని స్థిరపడ్డారు.

తొలివేద కాలం (క్రీ.పూ. 1500-1)ఈ కాలంలో ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి మాత్రమే పరిమితమయ్యారు. ఈ కాలం గురించి తెలుసుకోవడానికి రుగ్వేదం ఒక్కటే ప్రధాన ఆధారంగా ఉంది. 
ఆర్యులు భారతదేశంలో స్థిరపడ్డ తర్వాత రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు రాశారు. వేదాలన్నింటిలో రుగ్వేదం ప్రాచీనమైంది. ఇందులో పది మండలాలున్నాయి. యజుర్వేదం క్రతువుల నిర్వహణకు ఆధార గ్రంథం. సామవేదం సంగీతానికి మూలం. అధర్వణ వేదం మంత్రతంత్రాలకు సంబంధించింది. 
ఈ కాలంలో రాజ్యానికి రాజే అధిపతి. రాజరికం వంశపారంపర్యం. ప్రజల రక్షణ బాధ్యత రాజు చూసేవాడు. దీనికిగాను ప్రజలు రాజుకు గోవులను కానుకగా ఇచ్చేవారు. ఈ విధానాన్ని ‘బలి’ అని పిలిచేవారు. పాలనా వ్యవహారాల్లో ‘సమితి’, ‘సభ’ అనే సంస్థలు రాజుకు సాయపడేవి. సమాజంలో స్త్రీకి గౌరవప్రదమైన స్థానం ఉండేది. ‘సమితి’, ‘సభ’ సమావేశాల్లో మహిళలు సైతం పాల్గొనేవారు. వితంతు పునర్వివాహాలు జరిగేవి. సతీసహగమనం, పరదా పద్ధతి వీరికి తెలియదు. రుగ్వేదకాలంనాటి ఆర్యులకు పశుపోషణ, వ్యవసాయం ప్రధాన వృత్తులు. పశువులను.. ముఖ్యంగా ఆవులను ప్రాణప్రదంగా భావించేవారు. వీటిని వర్తకంలో మారకంగా ఉపయోగించేవారు. ఆర్యులు ప్రకృతి శక్తులను పూజించారు. ద్యుస్ (ఆకాశం), ఇంద్ర, వరుణ, వాయు, అగ్ని, సోమ తదితర పురుష దైవాలతో పాటు అతిథి, ఉషస్సు లాంటి స్త్రీ మూర్తులను కూడా ఆరాధించేవారు. ఇంద్రుడు వీరి ప్రధాన దైవం.

వేదాలు:1) రుగ్వేదం
2) యజుర్వేదం 
3) సామవేదం
4) అధర్వణ వేదం

ఉపవేదాలు:1) ధనుర్వేదం
2) ఆయుర్వేదం
3) శిల్పవేదం
4) గాంధార వేదం

వేదాంగాలు:1) శిక్ష 
2) కల్పం 
3) జ్యోతిషం
4) వ్యాకరణం
5) నిరుక్తం 
6) చంధస్సు

దర్శనాలు - అందులో ప్రసిద్ధులు:1) సంఖ్య - కపిలుడు
2) వైశేషికం - కణాదుడు
3) న్యాయం - గౌతముడు
4) యోగ - పతంజలి
5) మీమాంస - జెమిని
6) ఉత్తర మీమాంస - బాదరాయణుడు 

మలివేదకాల ఆర్య నాగరికత (క్రీ.పూ.1000-600)ఈ కాలంలో ఆర్యులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తర బిహార్ ప్రాంతాలకు విస్తరించారు. వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా స్వీకరించిన జాతులన్నీ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. క్రమంగా ఆధిపత్యం కోసం తెగల మధ్య యుద్ధాలు ప్రారంభమయ్యాయి. విజయం సాధించిన తెగ నాయకుడు విశాల భూభాగానికి అధినేతగా మారాడు. అతడు సామ్రాట్ తదితర బిరుదులను వహించడం ఆరంభమైంది. అశ్వమేథ, రాజసూయ, బలి కర్మకాండలు ప్రారంభమయ్యాయి. సామ్రాజ్యాల విస్తరణ పెరిగింది. రాజు దైవాంశ సంభూతుడుగా మారాడు.

రుగ్వేదంలోని పురుష సూక్తం ఆధారంగా మలివేద కాలంలో వర్ణవ్యవస్థ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలుగా సమాజ విభజన జరిగింది. క్రమంగా వృత్తులు వంశపారంపర్యమయ్యాయి. ఈ యుగంలో స్త్రీ అంతకుముందున్న సామాజిక స్థాయిని కోల్పోయింది. సతీ సహగమన పద్ధతి మొదలైంది. వివాహ నిబంధనలు కఠినమయ్యాయి. 
కొత్తగా భూములు సాగులోకి రావడంతో వ్యవసాయాభివృద్ధి అధికమైంది. వర్తకం, వాణిజ్యం, పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పట్టణాలు ఏర్పడ్డాయి. తక్షశిల, హస్తినాపురం, కౌశాంబి, కాంపల్య, వైశాలి, శ్రావస్థి, వారణాసి మొదలైనవి నాటి ప్రసిద్ధ నగరాలు. వస్తుమార్పిడి స్థానంలో ‘నిష్క’, ‘శతమాన’, ‘కర్షాపణం’ అనే నాణేలు ప్రవేశించాయి. బంగారం, వెండి, రాగితో ఈ నాణేలను తయారు చేసేవారు. సృష్టికర్తగా ‘ప్రజాపతి’ ఈ యుగ ప్రధాన ఆరాధ్య దైవం. అగ్ని, ఇంద్రుడు లాంటి దైవాలకు ప్రాధాన్యం తగ్గి త్రిమూర్తుల (విష్ణు, బ్రహ్మ, శివుడు) ఆరాధన పెరిగింది.

రుగ్వేద సంహిత: ఇందులో 1028 శ్లోకాలున్నాయి. ఇది పురాతనమైంది. అగ్ని, ఇంద్రుడు, వరుణుడు లాంటి అనేక దేవతల స్తోత్ర పాఠాలు ఈ సంహితంలో ఉన్నాయి. ఇందులో ఇంద్రుడి గురించి ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి.
సామవేద సంహిత: సోమ యజ్ఞాలు చేసేప్పుడు సంగీత బద్ధంగా శ్లోకాలను ఎలా ఆలపించాలో సామవేద సంహిత తెలుపుతుంది. భారతీయ సంగీత మూలాలు సామవేదంలో కనిపిస్తాయి.
యజుర్వేద సంహిత: ఇందులో యజ్ఞ సమయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, పఠించే మంత్రాల గురించి ఉన్నాయి.
అధర్వణ వేద సంహిత: రోగాలు, దుష్టశక్తులను పారదోలడానికి అవసరమైన మంత్రాలు, తంత్రాలు ఇందులో ఉన్నాయి. ఆర్యేతరుల విశ్వాసాల గురించి ఇది కొంతవరకు తెలుపుతుంది.
బ్రాహ్మణాలు: ఇవి వేదాల తర్వాత వచ్చాయి. కర్మకాండల విధానాన్ని వివరిస్తాయి. వీటిలో ప్రధానంగా యజ్ఞాలు, బలులకు సంబంధించిన విధివిధానాలు ఉన్నాయి.
అరణ్యకాలు: ఇవి తాత్విక చింతనకు చెందిన అంశాలతో కూడి ఉన్నాయి.
ఉపనిషత్తులు: ఉపనిషత్తులు తాత్విక గ్రంథాలు. వీటిలో ఆత్మ, అంతరాత్మ, ప్రకృతి రహస్యాల గురించి ఉన్నాయి. ఉపనిషత్తులు కర్మకాండలను నిరసించాయి. ఇవి సరైన జ్ఞానం, సన్మార్గానికి ప్రాముఖ్యం ఇస్తాయి. 

సామాజిక మార్పులు (క్రీ.పూ. 600-300)
ఈ కాలంలో అనేక మత ఉద్యమాలు ఆవిర్భవించాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ మార్పులు అధికంగా జరిగాయి. 16 జనపదాలు, పట్టణాలు ఏర్పడ్డాయి. దీన్ని రెండో పట్టణీకరణ కాలంగా పేర్కొంటారు. ఇనుముతో రూపొందించిన పరికరాల వాడకం వల్ల వ్యవసాయంలో అధిక వృద్ధి సాధ్యమైంది.
ఈ కాలంలో చాతుర్ వర్ణ వ్యవస్థ బలపడింది. ద్విజులుగా పేర్కొనే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు.. ద్విజులు కాని శూద్రులకు మధ్య సాంఘిక వ్యత్యాసం ఎక్కువైంది. బ్రాహ్మణాధిపత్యం వైశ్యులకు, క్షత్రియులకు నచ్చలేదు. అస్పృశ్యులను ఒక ప్రత్యేక వర్గంగా చూడటం ఈ కాలంలోనే ప్రారంభమైంది. వ్యవసాయ రంగంలోని మిగులుతో రాజులు సైన్యాన్ని నిర్మించారు. రాజులు పన్ను వసూలు చేసేవారు. న్యాయ వ్యవస్థకు పునాది పడింది. జీవహింసకు వ్యతిరేకమైన బౌద్ధ, జైన మతాలు వ్యవసాయ రంగ అభివృద్ధికి తోడ్పడ్డాయి.

బౌద్ధమతం (క్రీ.పూ. 563-483)
బౌద్ధమత స్థాపకుడు సిద్ధార్థుడు (గౌతముడు). ఈయన క్షత్రియ వంశానికి చెందినవారు. క్రీ.పూ. 563లో శాక్యరాజ్యాధిపతి శుద్ధోదనుడు, మాయాదేవికి రాజధాని ‘కపిలవస్తు’ సమీపంలోని ‘లుంబినీ వనం’లో జన్మించారు. గౌతముని భార్య పేరు ‘యశోధర’, కుమారుని పేరు ‘రాహులుడు’. కపిలవస్తు నగరంలో కనిపించిన వృద్ధుడు, వ్యాధిగ్రస్థుడు, శవం, సన్యాసి దృశ్యాలు ఆయన్ని కదల్చివేశాయి. దీంతో భవబంధాల నుంచి బయటపడ్డారు. దీన్నే ‘మహాభినిష్ర్కమణం’ అంటారు. గయ సమీపంలో బోధి వృక్షం కింద నలభై రోజుల తపస్సు తర్వాత ‘సంభోది’ని పొంది ‘బుద్ధుడై’ పరిపూర్ణ జ్ఞానంతో ఉద్దీప్తుడయ్యాడు. మొదటగా సారనాథ్‌లోని ‘మృగదావనం’లో అయిదుగురు శిష్యులకు జ్ఞానబోధ చేశాడు. ఈ ప్రబోధాన్ని ‘ధర్మచక్ర ప్రవర్తనం’ అంటారు. బుద్ధుడు తన 80వ ఏట క్రీ.పూ.483లో మహాపరి నిర్యాణం పొందారు. బుద్ధుడి శిష్యుడు ఆనందుడు.

బుద్ధుడికి సంబంధించిన అంశాలు:
తండ్రిశుద్ధోదనుడు
తల్లిమాయాదేవి
సవతి తల్లిగౌత మి
బంధువుదేవదత్త
భార్యయశోధర
కుమారుడురాహుల్
రథ చోదకుడుచె న్నుడు
గుర్రంకంధక
గురువుఅలారకలామ
బుద్ధగయలో పరిచర్యలు చేసినదిసుజాత

ఆర్య సత్యాలు 1) ప్రపంచం దుఃఖమయం.
 2) దుఃఖాలకు కోర్కెలే కారణం.
 3) కోర్కెలను నిరోధిస్తే దుఃఖం అంతమవుతుంది.
 4) దుఃఖాన్ని అంతమొందించడానికి మార్గం ఉంది.
 అజ్ఞానమే దుఃఖానికి కారణమని పేర్కొని, దీన్ని తొలగించడానికి ‘అష్టాంగమార్గం’ రూపొందించాడు. అవి.. సరైన వాక్కు, క్రియ, జీవనం, శ్రమ, ఆలోచన, ధ్యానం, నిశ్చయం, దృష్టి. పునర్జన్మ రహితమైన మోక్షమే నిర్యాణం అని చెప్పారు. బౌద్ధమతం హేతుబద్ధమైంది. బుద్ధుడు ఆత్మ, భగవంతుడి ఉనికిని గుర్తించలేదు. వైదిక కర్మకాండలను, వేదాలను నిరసించారు.
 మొదటి ‘బౌద్ధ సంగీతి’ రాజగృహంలో అజాత శత్రువు పాలనా కాలంలో జరిగింది. దీని అధ్యక్షుడు మహాకాశ్యప. ఈ సంగీతిలో ‘వినయ’, ‘సుత్త’ అనే పీఠికల (నియమావళి గ్రంథాలు)ను సంకలనం చేశారు. రెండో సంగీతి ‘వైశాలి’లో జరిగింది. ఈ సంగీతిలో బౌద్ధసంఘం ‘థెరవాదులు’, ‘మహాసాంఘికులు’ అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. మూడో సంగీతి అశోకుడి కాలంలో పాటలీపుత్రంలో జరిగింది. ఈ సంగీతిలో అభిదమ్మ పీటకాన్ని రచించారు. నాలుగో సంగీతి కనిష్కుడి పాలనా కాలంలో వసుమిత్రుడి అధ్యక్షతన జరిగింది. సాంచి, బార్హూత్, అమరావతి ఈ కాలంనాటి శిల్పకళకు ప్రతీకలైన స్తూపాలు. చైత్య గృహాల నిర్మాణానికి అజంతా, ఎల్లోరా ఉదాహరణలు. బుద్ధుని సందేశాన్ని భిక్షకులు విదేశీయులకు అందించారు. బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. చైనా, జపాన్, శ్రీలంక, బర్మా మొదలైన తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లో బౌద్ధ మతం విస్తరించింది. కాశ్మీర్‌లో జరిగిన నాలుగో బౌద్ధ సంగీతిలో బౌద్ధమతం మహాయాన, హీనాయాన శాఖలుగా చీలిపోయింది.

 మహాయానం: ఈ శాఖకు చెందినవారు బుద్ధ విగ్రహాలను ఆరాధించేవారు. బుద్ధుడు, బోధిసత్వుల ద్వారా మానవులు మోక్షం పొందొచ్చని  భావించారు. ఈ శాఖ ఇండియా, చైనా, జపాన్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. నాగార్జునుడు మాధ్యమిక చింతనను ప్రవేశపెట్టాడు. ప్రపంచమంతా మిథ్య, భ్రమ అని నాగార్జునుడి వాదన.
 హీనాయానం: బర్మా, థాయిలాండ్, కాంబోడియాలో ఈ శాఖ బాగా వ్యాపించింది. బుద్ధుడి ప్రవచనాలను మాత్రమే తీసుకుని ధ్యానం ద్వారా మోక్షం పొందొచ్చని వీరు భావించారు. విగ్రహారాధనకు వీరు వ్యతిరేకం. పాళీ భాషలో సుత్త, వినయ, అభిదమ్మగా పేర్కొనే త్రిపీఠకాలను వీరు రచించారు. క్రీ.శ 8వ శతాబ్దంలో వజ్రాయానం అనే కొత్త శాఖ వెలిసింది.
 స్తూపాలు: బుద్ధుడు లేదా ఇతర ప్రముఖ సన్యాసుల అవశేషాలను నిక్షిప్తం చేసి నిర్మించారు. వీటినే స్తూపాలు అంటారు.
 చైత్యం: ఇందులో ప్రధానంగా ప్రార్థనాలయం ఉంటుంది.

 ప్రధాన బౌద్ధ గుహాలయాలు, చైత్యాలయాలు:
 1) కార్లే 
 2) నాసిక్
 3) భాజ
 4) బార్హుత్
 5) సాంచి
 6) అమరావతి
 7) నాగార్జున కొండ
 8) భట్టిప్రోలు
 విహారం: బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ఆసియాలో అతిపెద్ద బౌద్ధ విహార కేంద్రం.

 మహా జనపదాలు - పట్టణాలు
 1
) మగధ- పాటలీపుత్రం
 2) కాశీ-వారణాసి
 3) అంగ - చంపా
 4) చేది - భుక్తిమతి
 5) కోసల-అయోధ్య
 6) కురు-ఇంద్రప్రస్థం
 7) వత్స-కౌశాంబి
 8) పాంచాల-అవిచ్ఛత్రము
 9) మత్స్య-విరాటనగరం
 10) అస్మక-పూతన్
 11) సూరసేన -మధుర
 12) అవంతి-ఉజ్జయిని
 13) కాంభోజ-రాజపురం
 14) గాంధార-తక్షశిల
 15) వజ్జి-విదేహ
 16) మల్ల-కుశి



మౌర్యుల అనంతర యుగం - గుప్త సామ్రాజ్యం

మధ్య ఆసియాకు చెందిన శకులు, కుషాణులు భారత్‌పై దండెత్తారు. శకుల్లో ప్రసిద్ధి చెందిన వాడు మొదటి రుద్రదాముడు. శాతవాహనులను ఓడించి మౌర్యుల నాటి సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. శ్రీగుప్తుడు గుప్తవంశ మూలపురుషుడు. ‘అలహాబాదు ప్రశస్తి’ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. హర్షవర్ధనుడు స్థానేశ్వర సింహాసనాన్ని అధిష్టించి హిందూస్థానాన్ని పాలించిన ఆఖరి హిందూ చక్రవర్తి.
మౌర్యుల అనంతర యుగం (క్రీ.పూ. 71 నుంచి)
మధ్య ఆసియాకు చెందిన శకులు, కుషాణుల వంటి తెగలకు నిస్సారమైన భూములున్న ప్రాంతంలో జీవనం కష్టతరమైంది. క్రీ.పూ. 220లో షిహువాంగ్ టీ చైనా గోడను నిర్మించటంతో ఈ తెగలు ఆ దేశంపై దాడి చేయలేకపోయాయి. ఇండియాపై దండెత్తాయి. శుంగ, కణ్వ వంశ రాజులు ఈ దాడులను ఎదుర్కోలేకపోయారు. ‘యవనులు’గా, ‘ఇండోగ్రీకులు’గా బాక్ట్రియా పాలకులైన గ్రీకులు డిమెట్రియస్ నాయకత్వంలో దండెత్తి ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో కొన్నింటిని ఆక్రమించారు. ఈ వంశంలో మీనాండర్ ముఖ్యుడు. అతడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. బౌద్ధాచార్యుడు నాగసేనుడు, మీనాండర్ మధ్య జరిగిన మత చర్చలను ‘మిళింద పన్హా’ గ్రంథంలో వివరించారు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం ఇండియాపై దాడిచేసిన మొదటి విదేశీ తెగ ఇండో గ్రీకులు. భారత్‌లో తమ రాజుల పేరు మీద బంగారు నాణేలు విడుదల చేశారు. ఉత్తర భారత వాయవ్య ప్రాంతంలో గ్రీకు శిల్పకళ ప్రభావంతో గాంధార శిల్పరీతి అభివృద్ధి చెందింది. మన దేశంలో మొదట బంగారు నాణేలు విడుదల చేసింది ఇండోగ్రీకులే. మౌర్యుల అనంతరం విదేశీరాజులు, తెగలు ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. ముస్లింలు రాజ్యాలు స్థాపించారు. స్వదేశీ రాజ్యాల్ని కూలదోశారేగానీ దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలో మౌలికమైన మార్పులు చేయలేదు. రైతులు, వృత్తికారులు, వ్యాపారులు ఎప్పటిలాగే జీవనం సాగించారు. స్వయం సంపూర్ణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా కొనసాగింది. పాలకుల మార్పు అంటే రైతుల మిగులును దోచుకునే ప్రభువుల సిబ్బంది మార్పుగానే ప్రజలు భావించేవారు. కానీ బ్రిటిష్ వాళ్లు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించారు. భారత ఆర్థిక, సంప్రదాయ వ్యవస్థను పూర్తిగా కొల్లగొట్టారు. వాళ్లెప్పుడూ భారతీయ జీవన విధానంలో అంతర్భాగం కాలేదు. దేశంలో పరాయి పాలకులుగానే మిగిలిపోయారు. దేశ వనరులు, సంపదను దోచుకెళ్లారు.

ప్రాచీన ఓడరేవులుఅరికమేడు: ఇది పుదుచ్చేరి సమీపంలో ఉంది. క్రీ.శ. రెండో శతాబ్దంలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి రోమ్ సామ్రాజ్యానికి వాణిజ్య లావాదేవీలు జరిగేవి. 
బ్రోచ్ (భరుకచ్చ): ఇది గుజరాత్‌లో ఉంది.
చాల్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉంది. టాలమీ రచనల్లో దీని గురించి పేర్కొన్నాడు. 
కావేరీపట్నం (ప్రహార్): ఇది కావేరీ నదీతీరంలో ఉండేది. దీన్ని కరికాల చోళుడు నిర్మించాడు.
మౌజురిస్: పెరిప్లస్, టాలమీ దీని గురించి ప్రస్తావించారు. రెండో శతాబ్దంలో మలబార్ తీరంలో ఇది ప్రసిద్ధి గాంచింది. 
సొపారా: ఇది మహారాష్ట్రలో ఉంది.
తామ్రలిపి: పశ్చిమ బెంగాల్‌లో ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ప్రసిద్ధి చెందింది. 

శకులు (క్రీ.పూ. 90)వీరిని సిథియన్లు అనికూడా అంటారు. వీరు ‘యూచి’ జాతివారు. శకుల్లో ప్రసిద్ధి చెందిన వాడు మొదటి రుద్రదాముడు. అతడు క్రీ.శ.130 - 150 మధ్య పాలించాడు. శాతవాహనులను ఓడించి, ప్రజా సంక్షేమం కోసం మౌర్యుల నాటి సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. మొదటి సంస్కృత శాసనాన్ని వేయించాడు. 
జునాగఢ్ శాసనాన్ని రుద్రదాముడు వేయించాడు. గుప్త చక్రవర్తి విక్రమాదిత్యుడు ఈ వంశానికి చెందిన రుద్రసింహుని జయించి శకరాజ్యాన్ని ఆక్రమించి ‘శకారి’ బిరుడు పొందాడు. తర్వాత ‘పార్ధియన్’ వంశస్తులు రాజ్యానికి వచ్చారు.

కుషాణులు (క్రీ.శ. 78 - 101)
కుషాణులు ‘యూబ’ తెగకు చెందిన వారు. వీరిలో మొదటి రాజు కాడ్‌ఫెసైస్. అతడి కుమారుడు విమా కాడ్‌ఫెసైస్. ఇతడు ప్రవేశపెట్టిన బంగారు, రాగి నాణేలపై ‘మహేశ్వర’ పదం ఉంది. దీంతో వీరు శైవ మతస్తులని తెలుస్తోంది. కనిష్కుడు కుషాణ రాజుల్లో గొప్పవాడు. ఇతడికి ‘దేవపుత్ర’, ‘సీజర్’ బిరుదులున్నాయి. బౌద్ధమతం స్వీకరించి మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేశాడు. మత వ్యాప్తి కోసం గాంధార శిల్పాన్ని వినియోగించాడు. కనిష్కుడి తర్వాత రాజ్యానికి వచ్చిన వసిష్కుడు, హవిష్కుడు, రెండో కనిష్కుడు, వాసుదేవుడు సమర్థులు కారు. గ్రీకు, రోమన్ శిల్పశైలితో బుద్ధుని విగ్రహాల నిర్మాణం చేపట్టారు. అనంతరం ఇది గాంధార శిల్పకళగా పరిణతి చెందింది. శకులు, కుషాణులు, గ్రీకులు, పార్ధియన్లు తమ పొడవాటి కోట్లు, ట్రౌజర్లు, తలపాగాలను భారతీయులకు పరిచయం చేశారు. క్రీ.శ. 78లో కనిష్కుడు ‘శక’యుగాన్ని ప్రారంభించారు.

గుప్త సామ్రాజ్యం (క్రీ.శ. 320 - 540)శ్రీ గుప్తుడు గుప్తవంశ మూలపురుషుడు. తర్వాత అతడి కుమారుడు ఘటోత్కచగుప్తుడు రాజ్యాన్ని పాలించాడు. 

మొదటి చంద్రగుప్తుడు (క్రీ.శ. 320 - 335)ఘటోత్కచుని కుమారుడు మొదటి చంద్రగుప్తుడు. ఇతడ్ని గుప్తరాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. ఇతనితో ‘గుప్తశకం’ ప్రారంభమైంది. ‘దేవీచంద్రగుప్త’ అనే నాణేలను ముద్రించాడు. ఇతడికి ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు ఉంది. లిచ్ఛవీ రాకుమారి కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. దీంతో చంద్రగుప్తుడికి లిచ్ఛవీ రాజ్యంలో చాలాభాగం సంక్రమించింది. 

సముద్రగుప్తుడు (క్రీ. శ. 335 - 376) ‘అలహాబాదు ప్రశస్తి’ శాసనం సముద్రగుప్తుడి విజయాలు, విశిష్ట లక్షణాలు, బహుముఖ ప్రతిభను వివరిస్తుంది. ఇతడు అశ్వమేధయాగం చేశాడు. విద్యాపోషకుడు, పండితుడు, సంగీత విద్వాంసుడు. సముద్రగుప్తుడిని ‘ఇండియ న్ నెపోలియన్’గా స్మిత్ అభివర్ణించాడు. ‘విక్రమాంక’, ‘కవిరాజు’ బిరుదులున్నాయి. సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్న చిత్రాలతో నాణేలు ముద్రించాడు. 

సముద్రగుప్తుడు జయించిన దక్షిణాపథరాజులు - రాజ్యాలు
1. మహేంద్రుడుకోసల
2. వ్యాఘ్రరాజుమహాకాంతార
3. మంథరాజుకురాల
4. దమనుడుఎరండవల్లి
5. స్వామిదత్తుడుకొట్టూర
6. కుబేరుడుదేవరాష్ట్రం
7. మహేంద్రుడుపిష్టపురం
8. హస్తివర్మన్వేంగి
9. నీలరాజుఅవయుక్త
10. ఉగ్రసేనుడుపాలక
11. విష్ణుగోపుడుకంచి
12. ధనంజయుడుకేశస్థలపురం
 
 
రెండో చంద్రగుప్తుడు (క్రీ.శ. 376 - 415)శకరాజు రుద్రసింహుడిపై విజయం సాధించి ‘దేవగుప్తుడు’, ‘దేవరాజు’, ‘దేవశ్రీ’, ‘పరమభాగవత’, ‘విక్రమాదిత్య’, ‘శకారి’, ‘సాహసాంక’ బిరుదులు పొందాడు. ‘నవరత్నాలు’ అనే కవులను పోషించాడు. అతడి కాలంలో చైనా యాత్రికుడు ఫాహియాన్ భారత్‌ను సందర్శించాడు. ధ్రువాదేవి, కుబేరనాగ అతడి రాణులు. రాజధానిని ఉజ్జయినీకి మార్చాడు. కుమార్తె ప్రభావతిని వాకాటక రుద్రసేనుడికి ఇచ్చి వివాహం చేశాడు. బంగారంతో పాటు వెండి, రాగి నాణేలు ముద్రించాడు. బంగారు నాణేలపై వ్యాఘ్రానికి బదులు సింహం బొమ్మ ముద్రించాడు. సింహవిక్రమ అనే శాసనం వేయించాడు. 

మొదటి కుమార గుప్తుడు (క్రీ.శ. 415 - 454)మొదటి కుమారగుప్తుడికి ‘మహేంద్రాదిత్య’ బిరుదు ఉంది. చంద్రగుప్త, ధ్రువాదేవిల పుత్రుడు. ఇతడు ముద్రించిన బంగారు నాణేలపై ఒకవైపు నెమలి వాహనంపై ఉన్న కార్తికేయుడు, మరోవైపు నెమలికి మేత వేస్తున్న రాజు చిత్రాలు ఉంటాయి. వెండి నాణేల్లో గరుడ పక్షి స్థానంలో మయూరం కనిపిస్తుంది.

స్కందగుప్తుడు (క్రీ.శ. 454 - 467)స్కందగుప్తుడి కాలంలో ‘ హూణులు’ భారతదేశంపై దండెత్తారు. వారిని ఓడించి సామ్రాజ్యాన్ని రక్షించాడు. ‘విక్రమాదిత్య’ బిరుదు పొందాడు. ఇతడి కాలంలో రాష్ట్ర పాలకుడు వర్ణదత్తుడు గిర్నార్ కొండల్లో ఉన్న సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. సుమారు 300 ఏళ్ల క్రితం ఇదే తటాకానికి క్షాత్ర రుద్రదాముడు మరమ్మతులు చేయించాడు. క్రీ.శ. 495లో రెండోసారి హూణులు భారతదేశంపై దండెత్తారు.

కడపటి గుప్తరాజులు (క్రీ.శ. 467 - 540)స్కందగుప్తుడి తర్వాత క్షీణదశ ప్రారంభమైంది. హూణుల దాడులు, వారసత్వ పోరాటాలతో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడి గుప్తుల పాలన అంతమైంది. 

గుప్తుల కాలంనాటి సమాజంకులవ్యవస్థ పాతుకుపోయింది. శూద్రులు, ఛండాలురను హీనంగా చూసేవారు. సమాజంలో స్త్రీలకు విద్యా, ఆస్తిహక్కులు లేవు. బాల్య వివాహాలను సమర్థించారు. సతీసహగమనం ఉండేది. వారసత్వం విషయంలో గుప్తుల యుగాన్ని ఉజ్వల శకంగా పరిగణించవచ్చు. సంస్కృతం రాజభాష. అలహాబాద్ ప్రశస్తి శాసనాన్ని రాసింది హరిసేనుడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, శూద్రకుడు మృచ్ఛకటికం రాశారు. ఆర్యభట్టు ఆర్యభట్టీయం, వరాహమిహురుడు పంచసిద్ధాంతం, బ్రహ్మగుప్తుడు గణిత, ఖగోళ శాస్త్రాలు, శుశ్రుతుడు వైద్య శాస్త్రాలు రాశారు. గుప్త చక్రవర్తులు హిందూ మతాభిమానులు. వైష్ణవం వైపు మొగ్గు చూపారు. 

కళలుఝాన్సీ సమీపంలోని దేవగఢ్‌లోని దశావతార ఆలయం, భూమ్రా ఆలయం, సాంచీ, సారనాథ్‌లోని బౌద్ధ దేవాలయాలు గుప్తుల వాస్తుకళకు చిహ్నాలు. అజంతా గుహల్లోని కొన్ని కుడ్య చిత్రాలు గుప్తుల కాలంనాటి కళా నైపుణ్యానికి నిదర్శనం. భారవి కిరాతార్జునీయం, దండి కావ్యాదర్శం, దశకుమార చరితం, విష్ణుశర్మ ‘పంచతంత్రం’ గ్రంథాలు ఈ కాలం నాటివే. ఢిల్లీ సమీపంలోని మొహ్రాలీలో ఇనుపస్తంభం అప్పటి లోహ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం. 

అలహాబాద్ శాసన స్తంభంరెండు భాషల్లో రాసిన రెండు శాసనాలు ఇందులో ఉన్నాయి. అశోకుడి శాసనం ప్రాకృతంలో ఉంటుంది. దమ్మ, అహింస గురించి వివరిస్తుంది. రెండో శాసనాన్ని సముద్రగుప్తుని ఆస్థాన కవి హరిసేనుడు సంస్కృతంలో రాశాడు. ఇది సముద్రగుప్తుని దండయాత్రల గురించి తెలుపుతుంది.
 
గుప్తుల పరిపాలనగుప్త రాజులు.. మహారాజాధిరాజా, ఏకాధిరాజా, చక్రవర్తి, పరమేశ్వర, పరమద్వైత, సామ్రాట్ తదితర ఆడంబర బిరుదులను ధరించారు. వీరి కాలంలో కేంద్ర స్థాయిలో అనేకమంది అధికారులున్నారు. వీరిలో ముఖ్యులు... కాల్బలం, అశ్వికదళ అధ్యక్షుడు ‘భటాశ్వపతి’. గజదళానికి అధ్యక్షుడు ‘కటుక’, ‘టిలుపతి’. సైనిక కోశాధిగారానికి అధిపతి ‘రణభాండాగారాధికరణ’. సముద్రగుప్తుడి కాలంలో సంధి విగ్రాహక అనే పదవిని సృష్టించారు. ఇది విదేశాంగ మంత్రి పదవి. సముద్రగుప్తుడి కాలంలో అనేక మంది రాజులు సామంతులుగా మారారు. వారితో రాజు తరఫున వ్యవహారాలు నిర్వహించడం సంధి విగ్రాహకుడి ప్రధాన విధి. దూతకులనే అధికారులు రాజాజ్ఞలను చేరవేసేవారు. శాంతి భద్రతలకు సంబంధించిన ఉన్నతాధికారిని ‘దండపాశాధికరణ’గా పిలిచేవారు. ‘చేరొద్ధరణిక’ బాధ్యత దొంగలను పట్టుకోవడం. ఉన్నతాధికారులతో పాటు కుమారామాత్యులు, ఆయుక్తలు అనే ఉన్నతాధికారులు ఉండేవారు. 
రాష్ట్రాలను ‘భుక్తి’గా పిలిచేవారు. రాష్ర్ట పాలకులను ఉపారిక, భోగిక, రాజస్థానీయ అనే పేర్లతో పిలిచేవారు. రాజుకు పరిపాలనలో సహాయం చేసేందుకు కొందరు అధికారులుండేవారు. వీరిలో ముఖ్యమైనవారు మహామంత్రులు, గ్రామికులు, శౌల్కికులు, గౌల్మికులు, పుష్టపాల మొదలైనవారు. జిల్లాలను ‘విధి’ అనే విభాగాలుగా, విధులను గ్రామాలుగా విభజించారు. గ్రామ పాలనాధికారి ‘గ్రామిక’. పట్టణాల పాలనా బాధ్యతలను ‘పురపాల’ అనే అధికారి చూసేవారు

గుప్తుల వాస్తు శిల్పకళలు
భారతీయ వాస్తు శిల్ప కళారంగంలో గుప్తయుగాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేవాలయ నిర్మాణంలో వీరు ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు. దీన్ని నగర శైలి లేదా శిఖర శైలి అంటారు. గర్భగుడిపై వివిధ అంతస్తులు ఉన్న శిఖర నిర్మాణం ఇందులోని ప్రధానాంశం. వీరు నిర్మించిన దేవాలయాల్లో ఈ శైలి ప్రముఖంగా కనిపిస్తుంది. 
గుహాలయాలు: భారతదేశంలో హిందూ గుహాలయాల నిర్మాణాన్ని మొదటగా గుప్తులే ప్రారంభించారు. వీరి కాలం నాటి గుహాలయాలు ప్రముఖంగా అజంతా, ఎల్లోరా, బాఘ్, ఉదయ్‌గిరి మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఆలయాలు: గుప్తులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. అయినప్పటికీ వైష్ణవాలయాలతో పాటు శైవాలయాలూ నిర్మించారు. వీరి ఆలయాలు ప్రధానంగా భిటార్గావ్, నాచనకుటార, కోహ్, దేవ్‌గఢ్, తిగ్వా మొదలైన ప్రాంతాల్లో కనిపిస్తాయి. సాంచీ, గయ, సారనాథ్ లాంటి ప్రదేశాల్లో వీరి కాలం నాటి బౌద్ధాలయాలూ ఉన్నాయి.

గుప్తుల కాలం నాటి శిల్పకళరాగితో చేసిన రెండు బుద్ధ విగ్రహాలు వీరికాలం నాటి లోహ శిల్పకళకు ప్రముఖ నిదర్శనాలు. ఇందులో 7.5 అడుగుల ఎత్తయిన సుల్తాన్‌గంజ్‌లోని బుద్ధ విగ్రహం మొదటిది కాగా, 18 అడుగుల ఎత్తు ఉన్న నలందలోని బుద్ధుడి విగ్రహం రెండోది. రాతితో చేసిన శిల్పాల్లో సారనాథ్‌లోని బుద్ధ విగ్రహం, ఉదయగిరి గుహల్లోని వరాహ విగ్రహం ప్రసిద్ధి చెందినవి.
చిత్రకళ: అజంతా, బాఘ్, బాదామీ ప్రాంతాల్లో గుప్తుల చిత్రకళకు సంబంధించిన ఆనవాళ్లు లభిస్తున్నాయి. 

సాహిత్యంప్రధాన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు ఈ కాలంలోనే తుది రూపాన్ని సంతరించుకున్నాయి. పురాణాలు కూడా ఈ కాలంలోనే లిఖిత రూపాన్ని పొందాయి. గుప్తుల కాలం అనేక స్మృతి గ్రంథాల రచనకు చిరునామాగా మారింది. రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలోని నవరత్నాలతోపాటు అనేక మంది బౌద్ధ, జైన కవులు తమ రచనల ద్వారా ఈ కాలం నాటి సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వసుబంధుడు ‘స్వప్న వాసవదత్త’ అనే గ్రంథాన్ని, దిగ్నాగుడు ‘ప్రమాణ సముచ్ఛయం’, ఆర్యా అసంగుడు యోగాచారం అనే గ్రంథాలను రాశారు. ఈ కాలం నాటి నవరత్నాల్లోని కొందరు కవులు ప్రసిద్ధ రచనలు చేశారు. 

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంగణితంలో దశాంశ పద్ధతితో పాటు, సున్నా(0) ఉపయోగం గుప్తుల కాలం నుంచే ప్రారంభమైంది. ఆర్యభట్టుడు తన సూర్య సిద్ధాంతంలో చంద్ర, సూర్య గ్రహణాల గురించి వివరించాడు. అలాగే భూమి పరిమాణాన్ని, విశ్వానికి సూర్యుడే కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చాటిచెప్పాడు. ఇతడు ‘ఆర్యభట్టీయం’ గ్రంథంలో గణిత శాస్త్రంలోని పలు భాగాలను వివరించాడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, బృహజ్జాతక, బృహత్ సంహిత గ్రంథాల ద్వారా ఖగోళ, భౌతిక, భూగోళ, జీవశాస్త్రాలపై చర్చించాడు. బ్రహ్మగుప్తుడు.. భూ గురుత్వాకర్షణశక్తి గురించి తెలిపాడు. ఇతడు బ్రహ్మస్ఫూత సిద్ధాంత, ఖండఖడ్యాక అనే గ్రంథాలను రచించాడు. గుప్తుల కాలం నాటి శాస్త్ర, సాంకేతికాభివృద్ధికి రెండో చంద్రగుప్తుడి మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం ఓ మచ్చుతునక. కొన్ని వందల ఏళ్లుగా ఈ స్తంభం చెక్కు చెదరకుండా నేటికీ సగర్వంగా నిలిచింది.




దక్షిణ భారతదేశ చరిత్ర(క్రీ.పూ. 250 - క్రీ.శ. 250)

శాతవాహనులు
శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు. నానాఘాట్, హాతిగుంఫా శాసనాల్లో శ్రీ శాతకర్ణి గురించి వర్ణించారు. శాతవాహన రాజుల్లో ప్రసిద్ధుడు గౌతమీ పుత్రశాతకర్ణి. ఇతడి గురించి నాసిక్ శాసనంలో ఉంది. హాలుడు ప్రాకృతంలో ‘గాథా సప్తశతి’ గ్రంథం రచించాడు. ఒకటో పులోమావి చివరి కణ్వ పాలకుడైన సుశర్మను సంహరించాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి రుద్రదాముని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన చివరి రాజుల్లో గొప్పవాడు. శాతవాహనుల్లో చివరి పాలకుడు మూడో పులోమావి.
కంచి పల్లవులు (క్రీ.శ. 300-888)పల్లవ వంశ స్థాపకుడు ‘వీరకూర్చవర్మ’. ఇతడి కుమారుడు శివస్కందవర్మ. మహాపల్లవ వంశానికి మూల పురుషుడు సింహ విష్ణువు. ఇతడు చోళ, పాండ్య, సింహళ రాజులను ఓడించి, ‘అవనీసింహ’ అనే బిరుదు పొందాడు. ఇతడి కుమారుడైన మహేంద్రవర్మను చాళుక్యరాజు రెండో పులకేశి ‘పుల్లలూర్’ యుద్ధంలో ఓడించాడు. మహేంద్రవర్మ ‘మత్తవిలాస ప్రహసనం’ అనే వ్యంగ్య నాటకాన్ని రచించాడు. ఇతడు గొప్ప శిల్పకళాపోషకుడు. మామండనూర్, దళవదూర్ గృహాలయాలు, చిత్తన్న వానల్‌లోని కుడ్య చిత్రాలు ఇతడి కళాపోషణకు నిదర్శనాలు. మహేంద్రవర్మ కుమారుడు నరసింహవర్మ పల్లవ రాజులందరిలో అగ్రగణ్యుడు. ఇతడు రెండో పులకేశిని చంపి తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
మొదటి నరసింహవర్మ (క్రీ.శ. 630 - 668): ఇతడు శివ భక్తుడు. ఇతడు కైలాసనాథ, తీర (షోర్ టెంపుల్) దేవాలయాలను నిర్మించి కళా ప్రపంచంలో చిరస్మరణీయ స్థానం సంపాదించాడు. ఇతడు 641లో పులకేశిని ఓడించాడు. చోళ, పాండ్య పాలకులు ఇతడికి సామంతులుగా ఉన్నారు. ఇతడు సాధించిన విజయాల వల్ల ‘వాతాపికొండ’, ‘మహామల్ల’ బిరుదులతో కీర్తి పొందాడు. సంస్కృత కిరాతార్జునీయ కావ్యాన్ని రచించిన భారవి ఇతడి ఆస్థానకవి. ఇతడి కాలంలో యువాన్‌చాంగ్ కంచిని 
దర్శించాడు.
నందివర్మ: ‘పల్లవ మల్ల’ బిరుదాంకితుడు. ఇతడు వైకుంఠ పెరుమాళ్ దేవాలయాన్ని నిర్మించాడు. పల్లవుల దేవాలయ శిల్పకళలో ఆలయాలు, మండపాలు, రథాలు అనే మూడు రకాల నిర్మాణాలు ఉన్నాయి. వరాహ, త్రిమూర్తి, మహిషాసురమర్థని, పంచపాండవుల మండపం (రథాలు) నందివర్మ శిల్ప కళాపోషణకు తార్కాణాలు. పల్లవుల పాలనా వ్యవస్థ మౌర్యులు, ఆంధ్ర శాతవాహనుల పరిపాలనా వ్యవస్థను పోలి ఉంది.

పశ్చిమ చాళుక్యులు (క్రీ.శ. 500-757)పశ్చిమ చాళుక్కుల రాజధాని ‘వాతాపి’ లేదా ‘బాదామి’. వీరిని వాతాపి లేదా బాదామి చాళుక్యులు అని కూడా అంటారు. చాళుక్య వంశ మూలపురుషుడు జయసింహ వల్లభుడు. సత్యాశ్రయ పులకేశి ‘వాతాపి’ (బీజాపూర్ జిల్లా, కర్ణాటక) నగరాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. రెండో పులకేశి దక్షిణాపథ సార్వభౌముడిగా కీర్తి పొందాడు. ఇతడు ‘ఐహోల్’ వద్ద రాయించిన శాసనం అతడి విజయాల గురించి వర్ణిస్తుంది. ఇతడు ఎలిఫెంటా, పట్టాడక్కల్ దేవాలయాన్ని నిర్మించాడు. రెండో హర్షుడిని ఓడించాడు.

తూర్పు చాళుక్యులు (క్రీ.శ. 630-970)ఆంధ్ర సంస్కృతి, తెలుగు భాషకు తూర్పు చాళుక్యులు ఎనలేని సేవ చేశారు. ఈ వంశంలో రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర భాషా సాహిత్య పరిపోషకుడిగా పేరుపొందాడు. ఈ వంశ స్థాపకుడైన కుబ్జ విష్ణువర్థనుడికి ‘విషమసిద్ధి’ అనే బిరుదు ఉంది. 

కళ్యాణి చాళుక్యులు (క్రీ.శ. 973-1189)తైలపుడు రాష్ట్రకూట రాజును ఓడించి చాళుక్య రాజ్యాన్ని పునఃస్థాపించాడు. ఇతడు ‘కళ్యాణి’ని రాజధానిగా చేసుకొని పాలించాడు. కళ్యాణి చాళుక్యుల కాలంలో కన్నడ, సంస్కృత భాషలు అభివృద్ధి చెందాయి. బసవేశ్వరుడు వీరశైవ (ఆరాధ్య) మతాన్ని స్థాపించాడు.

మాన్యఖేట రాష్ట్రకూటులు (క్రీ.శ. 757-973)జైనమతానికి, కన్నడ భాషకు మాన్యఖేట రాష్ట్రకూటులు ఎనలేని సేవ చేశారు. ఈ వంశానికి మూల పురుషుడు దంతి దుర్గుడు (752-56). ఇతడికి ‘ఖడ్గావలోక’, ‘వైరమేఘ’ అనే బిరుదులు ఉన్నాయి.
ధ్రువుడు (780-92): ఇతడి కాలంలో రాష్ట్రకూట సామ్రాజ్యం అఖిల భారత ప్రతిష్టను పొందింది. గంగా కావేరీ నదుల మధ్య వీరికి ఎదురే లేకుండా పోయింది. ధ్రువుడికి నిరుపమ, కలివల్లభ, శ్రీ వల్లభ, ధారావర్ష అనే బిరుదులున్నాయి.
మూడో గోవిందుడు (792-814): ఇతడి కాలంలో రాష్ట్రకూట ప్రతిష్ట మహోన్నత స్థితికి చేరింది. ఇతడు జగత్తుంగ, ప్రభూత వర్ష అనే బిరుదులు ధరించాడు. ఇతడి కాలంలో ఉత్తరాపథంపై రాష్ట్రకూటుల అధికారం చెక్కు చెదరలేదు.
అమోఘవర్షుడు: ‘మాన్యఖేత’ అనే దుర్గాన్ని నిర్మించి రాజధానిగా చేశాడు. సోదరి శీల మహాదేవిని రెండో విజయాధిత్యుడి కుమారుడైన కలి విష్ణువర్థనుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈవిధంగా వేంగి చాళుక్యుల మైత్రిని సాధించాడు. గంగ, అంబిరాజులను సామంతులుగా చేసుకున్నాడు. ఇతడు కన్నడ భాషలో గొప్ప పండితుడు.
రెండో కృష్ణ: ఇతడు చోళరాజు పరాంతకుడి చేతిలో ‘వల్లా యుద్ధం’లో ఓడిపోయాడు. ఇతడిని ‘అకాలవర్షుడు’గా పేర్కొంటారు. 
రాష్ట్రకూటుల్లో మూడో కృష్ణ చివరి గొప్పరాజు. పరాంతకుడు ‘తక్కోల యుద్ధం’లో ఓటమిపాలయ్యాడు. అమోఘవర్షుడు ‘కవిరాజ మార్గం’ అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. ఎలిఫెంటా, ఎల్లోరాల్లో రాష్ట్రకూటుల శిల్పకళను చూడొచ్చు. రాష్ట్రకూట రాజు ఒకటో కృష్ణుడు ఎల్లోరా (మహారాష్ట్ర)లో కైలాస దేవాలయాన్ని నిర్మించాడు. ఇది ఏకశిలా నిర్మితం. దీన్ని నిర్మించడానికి 150 ఏళ్లు పట్టింది. పశ్చిమ కనుమల్లో ఒక కొండరాయిని ఎన్నుకొని దాన్ని కొండల నుంచి వేరు చేసి దేవాలయంగా మలిచారు. ప్రపంచంలో ఈ తరహా దేవాలయం ఎక్కడా లేదు.
తంజావూరు చోళులుఈ చోళ వంశస్థాపకుడు విజయాలయుడు. ఇతడు ఉరైయూర్‌లో క్రీ.శ. 850 ప్రాంతంలో పల్లవ సామంతుడుగా ఉంటూ పాండ్య సామంతుడైన ముత్తరయార్‌ను ఓడించి తంజావూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇతడి కాలం నుంచి చోళుల విజృంభణ ప్రారంభమైంది.
రాజరాజు (క్రీ.శ. 985-1014): చోళ రాజ్య ప్రతిష్టను పునరుద్ధరించి నూతనాధ్యాయాన్ని ప్రారంభించాడు. చోళుల ఇష్టదైవమైన శివుడికి బృహదీశ్వరాలయం (రాజరాజేశ్వరి దేవాలయం) నిర్మించాడు. ఇదే చోళకళకు ప్రసిద్ధి. భూమిశిస్తు విధానాన్ని సక్రమంగా అమలుపరచడానికి వ్యవసాయ భూములను ‘సర్వే’ చేయించాడు. ఇతడికి రాజరాజ (ది గ్రేట్) అనే బిరుదు ఉంది.
రాజేంద్ర చోళుడు (క్రీ.శ. 1014-1044): ఇతడు రాజరాజు కుమారుడు. శ్రీవిజయ సామ్రాజ్యంపై దండెత్తి శైలేంద్ర రాజును ఓడించాడు. క్రీ.శ. 1012లో అతడి రాజధాని నగరం ‘కందరం’ను ముట్టడించాడు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలపై ఆధిపత్యం సాధించాడు. ఇతడు ‘కదరగొండన్’, ‘త్రి సముద్రాదీశ్వర’ అనే బిరుదులు పొందాడు. బెంగాల్‌పై విజయం సాధించాడు. తల్లి కోరికపై ‘గంగైకొండ చోళపురం’ అనే నగరాన్ని నిర్మించాడు. దీన్ని తన రాజధానిగా చేసుకొని పాలించాడు.
ఒకటో రాజాధిరాజు (క్రీ.శ. 1044-52): ఇతడు రాజేంద్రుడి కుమారుడు. కళ్యాణి చాళుక్య రాజైన సోమేశ్వరుడిని ‘కొప్పం’ యుద్ధంలో ఓడించాడు. కానీ అదే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. మధుర, సింహళంలో చెలరేగిన తిరుగుబాట్లను అణచివేశాడు.
రెండో రాజేంద్రుడు (క్రీ.శ. 1052-64): ఇతడు రాజాధిరాజు సోదరుడు. చాళుక్యరాజును ‘కూడల్ సంగమ యుద్ధంలో’ ఓడించి కొల్హాపూర్ వద్ద విజయ స్తంభాన్ని వేయించాడు.
వీర రాజేంద్రుడు (క్రీ.శ. 1064-70): వేంగి, కళింగ, చక్రకూట పాలకులపై దాడులు చేశాడు. చాళుక్య రాజులను, విక్రమాదిత్యుడిని ఓడించాడు. ఇతడు తన కుమార్తెలను విక్రమాదిత్యుడు, కళింగ గంగ యువరాజైన రాజరాజుకు ఇచ్చి వివాహం చేశాడు.
మొదటి కులోత్తుంగ చోళుడు (క్రీ.శ. 1070 - 1120): వీర రాజేంద్రుడి తర్వాత వారసులు లేకపోవడం వల్ల రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవికి జన్మించిన రాజేంద్రుడు అధికారంలోకి వచ్చాడు. ఇతడు కులోత్తుంగ చోళుడు అనే పేరుతో సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడిది చాళుక్య చోళ వంశం. 
చోళుల కాలం తమిళ సాహిత్యానికి స్వర్ణయుగం. కంబకవి తమిళంలో రామాయణాన్ని రచించాడు. జయకొండార్ ‘పెరియపురాణం’ గ్రంథాన్ని రాశాడు.
ద్రావిడ దేవాలయాలుభారతీయ వాస్తుశైలిలో ద్రావిడశైలి ప్రసిద్ధమైంది. ద్రావిడ శైలి దేవాలయాల్లో ప్రముఖమైనవి బృహదీశ్వరాలయం, శ్రీ రంగనాథ స్వామి ఆలయం, మీనాక్షి దేవాలయం. 
బృహదీశ్వరాలయందీన్ని చోళ చక్రవర్తి తంజావూరులో నిర్మించాడు. ఇది ద్రావిడ శైలికి ప్రతీక. ఈ దేవాలయం గోపురంపై ఉన్న ఏకైక కలశం బరువు 90 టన్నులు.
రంగనాథ స్వామి ఆలయంద్రావిడ దేవాలయాల్లో ఇది అతి పెద్దది. ఇది కావేరి ఒడ్డున ఉన్న శ్రీరంగంలో ఉంది. ఇక్కడ స్వామి విగ్రహం శయనాకార రూపంలో ఉంటుంది. ఈ రూపంలో ఉన్న మరో విగ్రహం నెల్లూరులోని శ్రీ రంగనాయకుల దేవాలయంలో మాత్రమే ఉంది.
మీనాక్షి దేవాలయంనాయకరాజు కాలంలో మదురైలో నిర్మించారు. ఈ ఆలయంలో పలు ప్రాకారాలు, గోపురాలు ఉన్నాయి.